ఆ జిల్లాలోనే సర్కారు డాక్టర్లు అధికం..

31 Oct, 2020 07:44 IST|Sakshi

రెగ్యులర్‌ డాక్టర్లు 5,132 మంది 

సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా సర్కారు డాక్టర్లు 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 23,067 

నవజాత శిశుమరణాల రేటు రాష్ట్రంలో వెయ్యికి 19 

పీహెచ్‌సీలు మొత్తం 885.. బస్తీ దవాఖానాలు 110 

రాష్ట్ర గణాంక శాఖ నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు 5,637 మంది ఉన్నారని సర్కారు తెలిపింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర గణాంక శాఖ నివేదిక–2020 విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలపై విశ్లేషించింది. మొత్తం ప్రభుత్వ వైద్యుల్లో రెగ్యులర్‌ డాక్టర్లు 5,132 మంది ఉండగా, కాంట్రాక్టు డాక్టర్లు 505 మంది ఉన్నారు. జనరల్‌ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 152 ఉన్నాయి. ప్రత్యేక వైద్యం అందించే ఆసుపత్రులు 22, ప్యానెల్‌ క్లినిక్‌లు 49 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 885 ఉండగా, ఆయుష్‌ ఆసుపత్రులు 10 ఉన్నాయి. డిస్పెన్సరీలు 74, బస్తీ దవాఖానాలు 110, ఆరోగ్య ఉపకేంద్రాలు 4,797 ఉన్నట్లు సర్కారు తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం పడకల సంఖ్య 23,067 ఉన్నట్లు తెలిపింది. 

హైదరాబాద్‌లోనే అధిక పడకలు.. 
రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 22 జనరల్‌ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 9, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 8 చొప్పున ఉన్నాయి.  
ప్రత్యేక వైద్యం అందించే ఆసుపత్రులు అత్యధికంగా 10 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. డిస్పెన్సరీలు కూడా హైదరాబాద్‌లోనే 29 ఉన్నాయి. 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్‌లో 91 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 56 ఉన్నాయి. 
ఆరోగ్య ఉపకేంద్రాలు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 267 ఉన్నాయి. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 257, సంగారెడ్డి జిల్లాలో 246, రంగారెడ్డి జిల్లాలో 232 ఉన్నాయి.హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 52 ఉన్నాయి. 
బస్తీ దవాఖానాలు హైదరాబాద్‌లో అత్యధికంగా 64 ఉండగా, మేడ్చల్‌ జిల్లాలో 24, రంగారెడ్డి జిల్లాలో 22 ఉన్నాయి. ఏ ఇతర జిల్లాల్లో బస్తీ దవాఖానాలు లేవు. 
డాక్టర్ల సంఖ్య అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 421 మంది ఉండగా, నిజామాబాద్‌ జిల్లాలో 276, హైదరాబాద్‌లో 263 మంది ఉన్నారు. 
ఆసుపత్రుల్లో అత్యధిక పడకలు హైదరాబాద్‌లోనే 8,136 ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1,172 ఉన్నాయి. 
రాష్ట్రంలో అంగన్‌ వాడీ కేంద్రాలు 35,700 ఉన్నాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,093 ఉన్నాయి.   

నవజాత శిశుమరణాల రేటు 19 
రాష్ట్రంలో వెయ్యి జనాభాకు జనన రేటు 16.9 ఉండగా, దేశ సగటు 20. 
ప్రతి వెయ్యి మంది జనాభాలో మరణాల రేటు దేశ సగటు 6.2 ఉండగా, తెలంగాణలో అది 6.3గా ఉంది. 
శిశు మరణాల రేటు దేశంలో 32 ఉండగా, రాష్ట్రంలో 27గా ఉంది.  
నవజాత శిశు మరణాల రేటు (28 రోజుల లోపున్నవారు) ప్రతి వెయ్యి మందికి దేశంలో 23 ఉండగా, రాష్ట్రంలో 19గా ఉంది. 
ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు వెయ్యికి దేశంలో 36 ఉండగా, తెలంగాణలో 30గా ఉంది. 
మాతా మరణాల రేటు లక్షకు దేశంలో 113 ఉండగా, రాష్ట్రంలో 63గా ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు