ఉప్పుడు బియ్యంపై అట్టుడికిన సభ

6 Apr, 2022 03:42 IST|Sakshi
పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు 

లోక్‌సభ కార్యక్రమాలను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు 

కొనుగోళ్లపై నిర్దిష్ట విధానం ప్రకటించాలని పట్టు 

రాజ్యసభలో చర్చకు డిప్యూటీ లీడర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి పట్టు 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి టీఆర్‌ఎస్‌ కొనసాగిస్తున్న ఆందోళనతో మంగళవారం లోక్‌సభ అట్టుడికింది. ధాన్యం కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని కోరుతూ ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ అంశంపై త్వరితగతిన చర్చ చేపట్టి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనల నేపథ్యంలో సభ రెండుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనూ కేంద్రం తీరుకు నిరసనగా సభ్యులు వాకౌట్‌ చేశారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని విన్నవించారు.  

లోక్‌సభ రెండుమార్లు వాయిదా.. 
మంగళవారం సభ ఆరంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. ఎంపీలు నామా, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, కవిత, పసునూరి దయాకర్, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, రాములు.. తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు సైతం ధరల పెరుగుదల అంశంపై చర్చ కోరుతూ వెల్‌లోకి వెళ్లారు.

వీరితోపాటే వెల్‌లోకి వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ధాన్యం సేకరణపై జాతీయ విధానం తేవాలి.. అన్నదాతలను శిక్షించొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటున్న సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పెట్టి నిరసన కొనసాగించారు. టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశా రు. సభ తిరిగి మొదలయ్యాక సైతం ఎంపీలు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.  

రాజ్యసభలో వాకౌట్‌... 
రాజ్యసభ ఆరంభం అయిన వెంటనే చైర్మన్‌ వెంకయ్యనాయుడు.. సురేశ్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సురేశ్‌రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. ‘బాయిల్డ్‌ రైస్‌పై చర్చించాలని నోటీసులిచ్చాం. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు కేంద్రం తీరుతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య అయినందున చర్చ పెట్టండి’అని కోరారు. చైర్మన్‌ నిరాకరిం చడంతో సురేశ్‌రెడ్డి సహా ఇతర ఎంపీలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఎంపీలు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు.  

మరిన్ని వార్తలు