అనంతగిరి అందాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన కేటీఆర్‌

1 Jul, 2021 08:11 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా పడావు పడ్డ భూములు సాగవ్వడమే కాదు.. పర్యాటకంగా కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది’ అంటూ అందమైన అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్‌ ఫొటోతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. హైదరాబాద్‌ నుంచి 2 గంటల వ్యవధిలో ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చని ఆయన పేర్కొనడంతో హైదరాబాద్‌తో పాటు దూర ప్రాంతాల ప్రజల దృష్టి ఇటు మళ్లింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లంపల్లి నుంచి దిగువన మిడ్‌మానేరుకు వచ్చే నీళ్లు అక్కడి నుంచి అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. 3.5 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌ కొండల నడుమ పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. 

కాళేశ్వరానికి గుండెకాయగా..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌ను నిర్మించారు.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే ఇదో అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోంది. మిడ్‌మానేరు నుంచి 7.65 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ప్రవహించే నీరు తిప్పాపూర్‌లోని 92 మీటర్ల సర్జ్‌పూల్‌లో చేరుతోంది. అక్కడి నుంచి నాలుగు పంపుల ద్వారా అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటిని పంప్‌ చేస్తారు. దాంతో రిజర్వాయర్‌ నిండుగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లకు నీటిని తరలించడం జరుగుతోంది. 


రిజర్వాయర్‌ పక్కనే పోచమ్మ గుడి
అనంతగిరి రిజర్వాయర్‌ కట్ట పక్కనే ప్రసిద్ధి గాంచిన పోచమ్మ దేవాలయం ఉంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మహా రాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన వారంతా అనంతగిరి అందాలను వీక్షిస్తున్నారు. రిజర్వాయర్‌లో బోటింగ్‌ ప్రారంభిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు అంటున్నారు. 

సిద్దిపేట–సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లోనే..
అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌ సిద్దిపేట–రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ రిజర్వాయర్‌ రూపుదిద్దుకుంది. తాజాగా సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు రూ.254 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు మంజూరైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సిద్దిపేట నుంచి 20 నిమిషాల్లో ఈ రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. సిరిసిల్ల నుంచి వచ్చే పర్యాటకులు కూడా జిల్లెల్ల మీదుగా రావచ్చు. హైదరాబాద్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఈ రిజర్వాయర్‌ ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి కేవలం రెండు గంటల్లోనే అనంతగిరి చేరుకోవచ్చని కేటీఆర్‌ ట్విట్టర్‌లో చెప్పడంలో ఆంతర్యం అదే.


ప్రభుత్వం దృష్టి సారించాలి 
తెలంగాణ ప్రభుత్వం అనంతగిరి రిజర్వాయర్‌ను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. తిప్పాపూర్‌ పంపు హౌస్, అనంతగిరి టెంపుల్‌ సమీపంలో బోటింగ్‌ పాయింట్‌లు ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌ కూడా ఈ రూట్‌లోనే ఉండడంతో భవిష్యత్‌లో పర్యాటక తాకిడి పెరుగనుంది. 

మహానేత వైఎస్‌ ఆలోచనల్లోంచి...
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో రూపకల్పన చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే అనంతగిరి రిజర్వాయర్‌ తెరపైకి వచ్చింది. మిడ్‌మానేరు నుంచి చేవెళ్లకు నీటిని తీసుకెళ్లే క్రమంలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. దాంతో అనంతగిరి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 3.5 టీఎంసీలకు పెంచారు. తిప్పాపూర్‌ పంప్‌ హౌస్‌ నుంచి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేలా నిర్మించారు. ప్రాజెక్టుకు నాలుగు వైపులా గుట్టలు ఉండటంతో రిజర్వాయర్‌లోకి పంపుల ద్వారా వెళ్లే నీరు ఒక నదిలా కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చదనం.., గుట్టలతో అనంతగిరి అందాలు రెట్టింపయ్యాయి. 

మరిన్ని వార్తలు