శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

29 Mar, 2023 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మేరకుహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్‌, సల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్ల  పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.

30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకుయాత్ర చేరుకుంటుంది.

ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు .పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు