టీఆర్‌ఎస్‌కు షాక్‌.. కమలం గూటికి స్వామిగౌడ్‌‌

26 Nov, 2020 05:36 IST|Sakshi

బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ ఛైర్మన్

పార్టీ కండువాతో ఆహ్వానించిన జేపీ నడ్డా

కేసీఆర్‌ అవమానించారన్న స్వామిగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామి గౌడ్‌.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి స్వామి గౌడ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. ఇక త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని కీలక నేత కమలం గూటికి చేరడంతో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలినట్టైంది. 

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్‌ ఇవ్వగా తాజాగా స్వామిగౌడ్‌ను తమ గూటికి చేర్చుకుంది.

వందసార్లు అపాయింట్‌మెంట్‌ అడిగా: స్వామి గౌడ్‌
బీజేపీలో చేరడం అంటే తన తల్లి గారి ఇంటికి వచ్చినట్లు భావిస్తున్నట్టు స్వామి గౌడ్‌ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెండా పట్టని వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. మమ్మల్ని ఎండలో నిలబెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరాను. వందసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరాను. రెండేళ్లలో నాకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడుకునేందుకే బీజేపీలోకి వచ్చాను. టీర్‌ఆర్‌ఎస్‌లో చాలామంది అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుంది. హైదరాబాద్ మేయర్ సీటు బీజేపీ గెలుస్తుంద’ని అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు