నోముల కన్నుమూత

2 Dec, 2020 04:16 IST|Sakshi

సాగర్‌ ఎమ్మెల్యే నర్సింహయ్యకు గుండెపోటు

హుటాహుటిన ఆస్పత్రికి.. అప్పటికే తుదిశ్వాస

కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి

నార్కట్‌పల్లి కామినేనికి పార్థివదేహం తరలింపు 

గురువారం  అంత్యక్రియలు 

సాక్షి, హైదరాబాద్, నకిరేకల్‌: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) మంగళవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి, ఆయాసంతో విలవిల్లాడిన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలంగా ఆయన తీవ్రమైన మధుమేహం, స్పాండలైటిస్‌తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మంత్రులు కేటీఆర్, సబిత, ఈటల సహా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల్క సుమన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితోపాటు వివిధ ప్రజాసంఘాల నేతలు కొత్తపేటలోని ఆయన నివాసానికి చేరుకొని నోముల భౌతికకాయానికి నివాళు లర్పించారు. నోముల భౌతికకాయాన్ని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం హాలియాలోని ఆయన ఇంటికి తరలించగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె బుధవారం స్వగ్రామానికి చేరుకోనుండటంతో అప్పటివరకు ఆయన భౌతికకాయాన్ని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి భద్రపరిచామని, గురువారం ఉదయం స్వగ్రామమైన పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నర్రా ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..
నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో నోముల మంగమ్మ, రాములు దంపతులకు 1956 జనవరి 9న రెండో సంతానంగా నర్సింహయ్య జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో 1981లో ఎల్‌ఎల్‌బీ, 1983లో ఎంఏ పూర్తి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకునిగా పని చేశారు. నల్లగొండ, నకిరేకల్‌ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసి గుర్తింపు పొందారు. సీపీఎం సీనియర్‌ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1987 నుంచి 1999 వరకు నకిరేకల్‌ ఎంపీపీగా పనిచేశారు. రాఘవరెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతుండటంతో ఆయన స్థానంలో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి 1999లో తొలిసారి సీపీఎం నుంచి పోటీ చేసి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లోనూ అదేస్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

పదేళ్లపాటు సీపీఎం శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. పేదలపక్షాన అసెంబ్లీలో గళం విప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా నకిరేకల్‌ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో ఆయన 2009లో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరిన నోముల నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి జానారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా లెక్కచేయకుండా ప్రజాసేవే లక్ష్యంగా నియోజకవర్గంలో పర్యటించారు.
నోముల నర్సింహయ్య మృతదేహం వద్ద  నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

తనదైన శైలిలో వాణి వినిపించిన నేత
1999 నుంచి 2009 వరకు శాసనసభాపక్ష నేతగా సేవలందించిన నోముల... అసెంబ్లీలో బలమైన వాగ్ధాటిగల నేతగా ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా 1999 నుంచి 2003 వరకు అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అధికార పక్షాన్ని అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేయడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరుగాంచారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే చాలు అధికార, ప్రతిపక్షాలు నర్సింహయ్య ప్రసంగం వినేందుకు ఆత్రుతగా ఎదురుచూసేవి. విపక్ష నేతగా ఉన్న సమయాల్లో చంద్రబాబుతోపాటు దివగంత సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా