అనుమతిస్తే సరి.. లేదంటే కోర్టుకెళ్తాం: బీజేపీ

11 Sep, 2022 02:45 IST|Sakshi

12 నుంచి ప్రారంభంకానున్న సంజయ్‌ నాలుగోవిడత యాత్రపై బీజేపీ నేతలు

అడ్డుకునేందుకు సర్కారు కుట్ర చేస్తోందని ఆరోపణ 

22న పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపంలో ముగింపు సభ

సాక్షి, హైదరాబాద్‌: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాలుగో విడత పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా యాత్ర కొనసాగించి తీరుతాం. అనుమతిస్తే సరి, లేదంటే కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటాం’అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి, భండారి శాంతికుమార్, టి.వీరేందర్‌గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి తదితరులు సంజయ్‌ యాత్రకు సంబంధించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘గతంలోనూ యాత్రకు రాతపూర్వక అనుమతి ఇవ్వలేదు. ఇప్పటివరకైతే అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం’అని అన్నారు.

ఈ నెల 12న(సోమవారం) ఉదయం 10.30 గంటలకు కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిత్తారమ్మ ఆలయంలో సంజయ్‌ పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరనున్నారని తెలిపారు. అక్కడికి సమీపంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్‌తోపాటు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగే ఈ యాత్ర ఈ నెల 22న ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలోని పెద్దఅంబర్‌పేట వద్ద బహిరంగసభతో ముగియనుందని తెలిపారు.  

గ్రేటర్‌ ప్రజా సమస్యలే ఎజెండాగా.. 
ఆయా నియోజకవర్గాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు, లబ్దిదారులకు అందని రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, ట్రాఫిక్‌ నియంత్రణను గాలికొదిలేసిన పోలీసుల తీరు, ట్రాఫిక్‌లో ప్రజల నరకయాతన, గతుకుల రోడ్లు, కాలుష్యం, చెరువుల కబ్జా వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని బీజేపీ నేతలు చెప్పారు. కాలనీల్లో దోమలబెడద, మంచినీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ చా ర్జీల పెంపు, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గింపు వంటి అంశాలనూ ప్రస్తావిస్తామన్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ

మరిన్ని వార్తలు