26 వేల ఇంజనీరింగ్‌ సీట్ల మిగులు

20 Nov, 2021 02:28 IST|Sakshi

సివిల్, మెకానికల్‌ సీట్లపై అనాసక్తి 

కంప్యూటర్‌ కోర్సులపైనే ఇష్టం 

నేటి నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంకా 26,073 ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. వీటి భర్తీకి ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టింది. ఆన్‌లైన్‌ ద్వారా శని, ఆదివారాల్లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 24న ఆఖరి విడతగా సీట్లు కేటాయిస్తున్నట్లు సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెలాఖరు కల్లా ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు దాదాపు 32 వేల మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ వివరాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఈ నెలాఖరులోగా సమర్పించనున్నాయి. ప్రత్యేక విడతలో కేటాయించే సీట్లకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన తర్వాత ఈ ఏడాది ఎన్ని సీట్లు మిగులుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుందని ఎంసెట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మొత్తం 79,790 సీట్లకు అనుమతించింది.

రెండు దశల్లో చేపట్టిన కౌన్సెలింగ్‌లో 59,993 సీట్లు కేటాయించారు. గడువు ముగిసేలోగా 53,717 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. దీంతో 6,278 సీట్లు మిగిలిపోయాయి. దీనికి తోడు రెండో విడతలో ఆప్షన్లు ఇవ్వని కారణంగా 19,797 సీట్లు మిగిలాయి. ఇవన్నీ కలిపి మొత్తం 26,073 సీట్లకు ప్రత్యేక రౌండ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. కాగా, రెండు కౌన్సెలింగ్‌ల్లోనూ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్‌ సీట్లపై విద్యార్థులు అనాసక్తి ప్రదర్శించారు.  

మరిన్ని వార్తలు