9న భేటీకి హాజరుకాలేం.. కృష్ణా, గోదావరి బోర్డులకు  తెలంగాణ లేఖ 

6 Aug, 2021 03:44 IST|Sakshi

ఆరోజు సుప్రీం, ఎన్జీటీలో కేసులున్నాయని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి పూర్తి స్థాయి బోర్డుల భేటీకి తాము హాజరుకాలేమని తెలంగాణ తెలిపింది. ఈ మేరకు రెండు బోర్డులకు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ గురువారం లేఖ రాశారు. 9న సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసుల విచారణ ఉన్న దృ ష్ట్యా బోర్డుల అత్యవసర భేటీలకు తాము రాలేమని పేర్కొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీని సంప్రదించి మరో తేదీని నిర్ణయించాలని కోరారు. 9న అత్యవసర భేటీపై గోదావరి బోర్డు బుధవారమే లేఖ రాయగా, ఇదే తేదీన తామూ అత్యవసర భేటీని నిర్వహిస్తామంటూ గురువారం కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఈ లేఖలపై స్పందిస్తూ ఈఎన్‌సీ రెండు బోర్డులకు ప్రత్యుత్తరం రాశారు.  

ఆ ఇంజనీర్‌ను వద్దనడం అనైతికం 
తెలంగాణకు చెందిన సీడబ్ల్యూసీ ఇంజనీర్‌ దేవేంద్రరావును రాయలసీమ ప్రా జెక్టు సందర్శన కమిటీలో ఉండొద్దనడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. ఏపీ అభ్యంతరం అనైతికం, దురదృష్టకరమని పేర్కొంది. అదేమీ ఏకసభ్య కమిటీ కాదని, బోర్డు.. సీడబ్ల్యూసీ ఇంజనీర్లు ఉన్న కమిటీలోని అందరి సభ్యుల అభిప్రాయాల మేరకే నివేదిక ఉంటుందని తెలిపింది. సీడబ్ల్యూసీ అధికారికి ఉద్దేశాలను ఆపాదించడం సరికాదని పేర్కొంది. గతంలో పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిశీలనకు కమిటీలు నియమించినప్పుడు, అందులో సభ్యుడిగా ఉన్న కేజీబీఓ సీఈ శ్రీనివాస్‌పై తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని గుర్తు చేసింది. దీని దృష్ట్యా ఆ అధికారి పర్యటనను కొన సాగించేలా, ఎన్జీటీకి నివేదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్టీటీ కార్యకలాపాలను వాయిదా వేసేలా ఏపీ చేస్తున్న పన్నాగాలపై తెలంగాణ తీవ్ర నిరసన తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొంది.

మరిన్ని వార్తలు