టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో కొత్త కోణం.. ఎన్‌ఆర్‌ఐ లీడర్‌ సిఫారసుతోనే  రాజశేఖర్‌కు ఉద్యోగం?

20 Mar, 2023 07:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న టీఎస్‌పీఎస్సీ లీకేజీలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమిషన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొదలుకుని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఎన్‌ఆర్‌ఐలు కావడంపై సిట్‌ దృష్టి సారించినట్లు స్థానిక పోలీసు వర్గాల సమాచారం.  జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డిది సాధారణ కుటుంబం. అతని అత్తింటివారిదీ అదే పరిస్థితి.

అయితే రాజశేఖర్‌రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్‌ ఎన్‌ఆర్‌ఐ సర్కిల్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచి్చన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్‌స్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.  

గ్రూప్‌–1లో ‘విదేశీ’ కోణం పరిశీలించాలి.. 
రాజశేఖర్‌రెడ్డి ఎన్‌ఆర్‌ఐ మిత్రుల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. 2018లో విదేశాల నుంచి వచ్చిన ఆ ఇద్దరికీ పేపర్‌ లీక్‌ల ద్వారా రాజశేఖర్‌రెడ్డే కొలువులు దక్కేలా చేశాడని సిట్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రాజశేఖర్‌రెడ్డి మరో ఇద్దరు సన్నిహితులు గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి బంధువులు మాత్రం వారు దసరా కోసం వచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే.. ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌–1 రాశారో సిట్‌ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.  

ఆస్తులపై ఆరా.. 
కంప్యూటర్, డిజిటల్‌ పరిజ్ఞానం మీద పూర్తిస్థాయి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో రాజశేఖర్‌రెడ్డి పకడ్బందీగా లీకేజీ కథ నడిపాడని సిట్‌ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు రాజశేఖర్‌రెడ్డితో పాటు అతని సమీప బంధువుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న సిట్‌.. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌కు చెందిన ఇద్దరి వివరాలు సేకరించారని తెలిసింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు.. రాజశేఖర్‌ బంధువుల పాత్రపై అనుమానాలు

మరిన్ని వార్తలు