TSRTC Free Bus Travel: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: మహిళలకు అలర్ట్‌, రేపటి నుంచి..

14 Dec, 2023 21:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్‌. నవంబర్‌ 15 అంటే రేపు శుక్రవారం నుంచి ప్రయాణాల్లో ఆధార్‌ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే. కండక్టర్లకు ఆ కార్డుల్ని చూపించడంతో పాటు.. జీరో టికెట్‌ తీసుకోవాల్సిందేనని టీఎస్‌ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది. ఉదయం నుంచి ఈ నిబంధన అమలు అవుతుందని తెలిపింది. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9న ఈ స్కీమ్‌ ప్రారంభం అయ్యింది. అయితే తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. గురువారం వర్చువల్‌గా అధికారులతో సమావేశమైన ఆయన.. కండక్టర్లు జీరో టికెట్‌ జారీ చేయాలని,  ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలు అవుతోందని.. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేశారని అధికారుల్ని అభినందించారాయన. 

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ కింద.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీలో ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు ఉంది. తెలంగాణ వాళ్లకు(గుర్తింపు కార్డు ఉండాల్సిందే) మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

>
మరిన్ని వార్తలు