కేజీఎఫ్‌ చిత్రానికి మించి ఐదు రెట్లు 'సలార్‌' ఉంటుంది: భువన్‌

14 Dec, 2023 21:00 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'సలార్‌' మొదటి వరసలో ఉంటుంది. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ 22న  ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ స్నేహితులుగా ఇందులో కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కోట్లాది రూపాయలతో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. 'కేజీఎఫ్‌' తరహాలో ఈ చిత్రానికి గ్రాండ్‌ సెట్స్‌ వేశారు.

ప్రశాంత్‌ నీల్ అండ్ టీమ్ సినిమాకు కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. 'కేజీఎఫ్‌'  సెట్స్‌నే సలార్‌ కోసం వాడుతున్నారనే పుకార్లను కెమెరామెన్‌ భువన్ గౌడ తోసిపుచ్చారు. సలార్‌ సెట్స్‌ కోసం ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కీలకంగా పనిచేశారని ఆయన చెప్పారు. సలార్‌, కేజీఎఫ్‌ సెట్స్‌ పూర్తిగా వేరువేరు అని ఆయన తెలిపారు. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించిన కెమెరామెన్‌ భువన్ గౌడ ‘సలార్’ కోసం తన కెమెరా కన్నుతో టాలెంట్‌ చూపించాడని తెలుస్తోంది. 'సలార్' సినిమా కోసం పనిచేసిన తన అనుభవాన్ని భువన్ గౌడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ సినిమాలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించాం. అలెక్సా 39 అనే అత్యాధునిక కెమెరాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ కెమెరాలోని సీన్స్ ఐమాక్స్ క్వాలిటీతో ఉన్నాయి. కేజీఎఫ్‌తో పోలిస్తే ఈ సినిమా ఐదు రెట్లు మెరుగ్గా ఉంటుందని భువన్ గౌడ తెలిపారు. సినిమా చాలా రియలిస్టిక్‌గా వచ్చిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే తాము మరో రామోజీ ఫిల్మ్ సిటీని సృష్టించామని భువన్ గౌడ పేర్కొన్నారు. కేజీఎఫ్‌ చిత్రంతో పాటు ఉగ్రం మూవీ కోసం కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

మరోవైపు ఈ సినిమాలో యశ్‌  నటిస్తున్నారంటూ మళ్లీ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే, 'కేజీయఫ్‌'కు 'సలార్‌'కు లింక్‌ ఉందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆయా కథనాలపై 'సలార్‌' సింగర్‌ తీర్థ సుభాష్‌ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ కూడా స్పందించి సలార్‌లో ఎటువంటి ప్రత్యేక పాత్ర లేదని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు