కొత్తగా 300 ఎలక్ట్రిక్‌ బస్సులు!

19 Nov, 2021 05:35 IST|Sakshi

కొనుగోలుకు ఆర్టీసీ సన్నాహాలు 

ఫేమ్‌–2 పథకం కింద రాయితీపై ఇవ్వనున్న కేంద్రం 

నాన్‌ ఏసీ బస్సులే కావాలంటున్న అధికారులు 

ఏసీ బస్సులైతే నష్టాలు పెరిగిపోతాయని ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులు కొనాలని ఆర్టీసీ భావిస్తోంది. భారీగా పెరిగిన డీజిల్‌ ధరల నేపథ్యంలో బ్యాటరీ బస్సులతో ఆర్టీసీకి పెద్ద ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఏసీ బస్సులు మంజూరు అయ్యే అవకాశం కన్పిస్తుండటంతో నష్టాలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దీంతో నాన్‌ ఏసీ బస్సులు మాత్రమే కావాలని ఆర్టీసీ కోరుతోంది.

రూ.కోటి రాయితీతో.. 
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ‘ఫేమ్‌’(ఫాస్టర్‌ అడాప్షన్‌ అన్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అన్డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌) పథకాన్ని ప్రారంభించింది. రాయితీపై రాష్ట్రాలకు బస్సులను మంజూరు చేస్తోంది. అయితే ఒక్కోదాని ధర రూ.3 కోట్లకు పైగా ఉంటోంది. ఆర్టీసీలు అంత ధర పెట్టి తీసుకోలేవన్న ఉద్దేశంతో ప్రైవేటు సంస్థలు అద్దె ప్రాతిపదికన ఆరీ్టసీలో తిప్పేలా కేంద్రం పథకాన్ని రూపొందించింది.

ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక్కో బస్సుపై దాదాపు రూ.కోటి మేర రాయితీ ఇస్తోంది. ఫేమ్‌–1 కింద ఇదే పద్ధతిలో తెలంగాణ ఆరీ్టసీకి 40 ఏసీ బస్సులు మంజూరయ్యాయి. వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి తిప్పుతున్నారు. అయితే వీటి వల్ల ఆర్టీసీ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఇక ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు కొనొద్దని అప్పట్లోనే ఆర్టీసీ నిర్ణయించింది.  

గతంలో 324 బస్సులు మంజూరైనా.. 
గతేడాది చివరలో ఫేమ్‌–2 కింద టీఎస్‌ ఆరీ్టసీకి కేంద్రం 324 బస్సులు మంజూరు చేసింది. అవన్నీ ఏసీవే కావటంతో, ఆర్టీసీ తీసుకోలేదు. ఈలోపు ఆ పథకం గడువు ముగియటంతో ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఇటీవల, పథకాన్ని 2024 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫేమ్‌–2 కింద మంజూరైన బస్సులను తీసుకోవాలనే ఒత్తిడి మొదలైంది. అయితే మాకు నాన్‌ ఏసీ బస్సులే కావాలని, వాటినే తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

కానీ గతంలో ఏసీ బస్సులే మంజూరైనందున వాటినే కేంద్రం మంజూరు చేయనున్నట్టు సమాచారం. దీంతో ఇటీవల ఎండీ సజ్జనార్‌ అధ్యక్షతన సమావేశమైన ఉన్నతాధికారులు నాన్‌ ఏసీ బస్సులే వచ్చేలా చూడాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. 

చార్జీల భారంతో ఆదరణ కరువు 
ఆర్టీసీలో ఉన్న ఏసీ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 40 కూడా లేదు. బస్సు చార్జీలు ఎక్కువగా ఉంటుండటంతో జనం కూడా అంతగా ఆదరించడం లేదు. అదే సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. దీంతో ఇప్పుడు నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తే వాటిని జిల్లాలకు తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది. కానీ ఏసీ బస్సులే వస్తే జిల్లాలకు తిప్పలేమని, దూరప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉంటుందని ఇటీవలి సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఇప్పుడు ఆర్టీసీ ఎదురుచూస్తోంది. 

ఏసీ బస్సులతో నష్టాలే..! 
ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి తిరుగుతున్న 40 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులతో భారీ నష్టాలు నమోదవుతున్నాయి. నెలకు సగటున రూ.80 లక్షలకు పైగా నస్టం వాటిల్లుతోంది. గత ఏప్రిల్‌లో వీటి ద్వారా రూ.90 లక్షల ఆదాయం వస్తే రూ.1.75 కోట్ల ఖర్చునమోదైంది. వెరసి రూ.85 లక్షల నష్టం వాటిల్లింది. మే, జూన్‌ నెలల్లో కోవిడ్‌ ఆంక్షలు ఉండటంతో ఈ బస్సులు ఎక్కువగా తిరగలేదు. మళ్లీ ఆగస్టులో రూ.1 కోటి ఆదాయం వస్తే రూ.1.30 కోట్ల వ్యయం నమోదైంది. సెప్టెంబర్‌లో రూ.కోటి ఆదాయం వస్తే రూ.1.80 కోట్ల వ్యయం, అక్టోబర్‌లో రూ.1.30 కోట్ల ఆదాయం వస్తే, రూ.2.10 కోట్ల ఖర్చు నమోదైంది.  

మరిన్ని వార్తలు