క్యూనెట్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎంఎల్ఎం మోసాలపై సజ్జనార్ ఆందోళన

19 Jan, 2023 17:02 IST|Sakshi

అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని అని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు.

తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని తెలిపారు. అలాంటి మోసపూరిత  స్కీమ్ లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.

రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని స్పష్టం చేశారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు.

మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు.
(చదవండి: Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది)

అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్ లకు 2019లో నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ చేయడం గమనార్హం. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్‌ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

మరిన్ని వార్తలు