కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..

6 Oct, 2023 10:07 IST|Sakshi
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, టి.రాజయ్య

ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య

ఉప్పల వెంకటేశ్, నందికంటి శ్రీధర్‌కు కూడా పదవులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను, ఓ కార్పొరేషన్‌కు వైస్‌ చైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి. వీరితో పాటు ఇటీవల పారీ్టలో చేరిన ఉప్పల వెంకటేశ్‌ గుప్తా, నందికంటి శ్రీధర్‌కు కూడా అధికారిక పదవులు దక్కాయి.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆరీ్టసీ) చైర్మన్‌గా, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక ఉప్పల వెంకటేశ్‌ గుప్తా (కల్వకుర్తి)ను మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌గా, నందికంటి శ్రీధర్‌ (మల్కాజిగిరి)ను ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 

రాజీ ఫార్ములాలో భాగంగానే..! 
బీఆర్‌ఎస్‌ టికెట్‌లు దక్కని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు రాజీ ఫార్ములాలో భాగంగా ఈ పదవులు దక్కాయి. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మల్కాజిగిరి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నందికంటి శ్రీధర్‌ నాలుగు రోజుల క్రితమే బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్‌ ఇచ్చినా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో..ఆ పార్టీకి చెందిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి తాజాగా ఆయనకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఉప్పల వెంకటేశ్‌కు మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు.  
చదవండి: సిక్కిం వరదల్లో నిజామాబాద్‌ ఆర్మీ జవాన్‌ మృతి

మరిన్ని వార్తలు