ఓట్ల పండుగ.. రూ.కోట్లు పిండేద్దాం

11 Oct, 2023 04:25 IST|Sakshi

‘వంద రోజుల ఫెస్టివల్‌ చాలెంజ్‌’లో ఎన్నికలనూ చేర్చిన ఆర్టీసీ 

ఆదాయం ఎలా పెంచుకోవాలో సిబ్బందికి అత్యవసర ఆదేశాలు 

ఎన్నికల సభలకు బస్సులు అద్దెకు తిప్పాలని నిర్ణయం 

ప్రచార సామగ్రి తరలింపునకూ ఆర్టీసీ బస్సులు 

ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకూ బస్సులు 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ గతేడాది నుంచి ప్రత్యేక సందర్భాల్లో ‘చాలెంజ్‌’పేరుతో సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. గత దసరా, దీపావళి సమయాల్లో ఫెస్టివల్‌ చాలెంజ్, ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు వంద రోజుల చాలెంజ్‌లను నిర్వహించింది. ఇప్పుడు దసరా, దీపావళి, కార్తీకమాసం, శబరిమలై అయ్యప్ప  దర్శనం, క్రిస్‌మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతిలను పురస్కరించుకుని అక్టోబరు 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వరకు ‘100 రోజుల చాలెంజ్‌’ను నిర్వహిస్తోంది.

ఆయా సందర్భాల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా చూడటంతోపాటు, వీలైనన్ని ఎక్కువ బస్సులను రోడ్కెక్కించటం, ఎక్కువ కిలోమీటర్లు తిప్పటం లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భాల జాబితాలో ఎన్నికలు కూడా చేరాయి. ఈమేరకు అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఎన్నికల సమయంలోఏం చేస్తారంటే? 
ఎన్నికల సభలకు అద్దెకు బస్సులు: ప్రచారంలో రాజకీయ పార్టీలకు బహిరంగసభలు కీలకం. ఆ సభలకు జనాన్ని తరలించేందుకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయో ముందుగానే తెలుసుకుని ఆ సభలకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు బుక్‌ అయ్యేలా చూడాలి. 
 నగరంలో ఏ ప్రాంత ప్రజలు ఎక్కడో గుర్తింపు: నగరంలో ఉండే ఓటర్లలో చాలామంది ఓటు హక్కు వేరే నియోజకవర్గాల్లో ఉంటుంది. పోలింగ్‌ రోజు వారు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ నియోజకవర్గం ఓటర్లు నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారో గుర్తించాలి. వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకునేలా ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి ఒప్పించాలి. 
 ప్రచార సామగ్రి కోసం బస్సులు: ప్రచారంలో కీలకమైన సామగ్రిని తరలించేందుకు నేతలు వాహనాలను బుక్‌ చేసుకుంటారు. ఆర్టీసీ బస్సులను అందుకు బుక్‌ చేసేలా వారితో మాట్లాడి ఒప్పించాలి. 
 ఓటర్లూ బస్సులే ఎక్కాలి: వేరే ప్రాంతాల్లో ఉండే    ఓటర్లు పోలింగ్‌ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులనే ఎ క్కేలా చూడాలి. ఇందుకు ప్రచారం చేయటంతోపాటు, కీలక పాయింట్ల వద్ద స్టాఫ్‌ ఉండి దీనిని సుసాధ్యం చేయాలి. 
 ఈవీఎంలు, సిబ్బంది తరలింపునకు బస్సులు: పోలింగ్‌ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు ఎన్నికల సంఘం వాహనాలను బుక్‌ చేసుకుంటుంది. అందుకు ఆర్టీసీ బస్సులే బుక్‌ అయ్యేలా చూడాలి. గతేడాది దసరా, దీపావళి సమయాల్లో ఆర్టీసీ రూ.1360.69 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎన్నికల నేపథ్యంలో ఈసారి గతేడాది కంటే కనీసం 10 శాతం ఆదాయం పెరగాలన్నది సంస్థ లక్ష్యం.

మరిన్ని వార్తలు