కొలువుల్లోకి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు

17 Jul, 2021 02:22 IST|Sakshi

26న అందనున్న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు

28న విధుల్లో చేరాలని ఆదేశాలు

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ (టీఎస్‌ఎస్‌పీ) శిక్షణ కానిస్టేబుళ్లు ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ఈనెల 26వ తేదీన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) చైర్మన్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శిక్షణ అనంతరం వీరికి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయని తొలుత భావించారు. కానీ ఈనెల 28వ తేదీనే తమకు కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

దీంతో వీరికి కేవలం 25, 26, 27 తేదీల్లో మూడు మాత్రమే సెలవు దినాలు రానున్నాయి. 25వ తేదీలోగా ట్రైనీ కానిస్టేబుళ్లందరికీ స్టైఫండ్‌ చెల్లించాలని స్పష్టం చేశారు. మరోవైపు 22, 23, 24 తేదీల్లో వీరి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, విధుల్లో చేరాల్సిన తేదీలు ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా శిక్షణ కేంద్రాల్లోని దాదాపు 3,900 మంది టీఎస్‌ఎస్‌పీ ట్రైనీ కానిస్టేబుళ్లు రెట్టించిన ఉత్సాహంతో పరేడ్‌కు సాధన చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు