Sakshi News home page

యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్‌ శిక్షణ: ఇజ్రాయెల్‌ ఆరోపణ

Published Thu, Oct 26 2023 10:52 AM

Israel Hamas War Iran Gave Training Money and Weapons to Hamas - Sakshi

ఇ‍జ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం జరుగున్న  తరుణంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ యుద్ధానికి ముందుగానే హమాస్‌ మిలటెంట్లకు ఇరాన్‌ శిక్షణ ఇచ్చిందంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరగక ముందే ఇరాన్.. హమాస్ మిలటెంట్లకు శిక్షణ అందించడంతోపాటు డబ్బు, ఆయుధాలను కూడా ఇచ్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆరోపించింది.

పాలస్తీనా మిటటెంట్లు జరిపిన దాడిలో ఇరాన్ హస్తం కూడా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ ‘ఈ యుద్ధానికి ముందుగానే ఇరాన్‌.. హమాస్‌ మిలటెంట్లకు  శిక్షణ, ఆయుధాలు, నిధులు, సాంకేతికత సహాయాన్ని  అందించిందని అన్నారు. 

హమాస్‌కు ఆర్థికసాయం, శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇరాన్ అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడిలో తమ పాత్ర లేదని పేర్కొంది. ది జెరూసలేం పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం గాజాపై దండెత్తడానికి దక్షిణ సరిహద్దులో తమ గ్రౌండ్ ట్రూప్‌లు సిద్ధంగా ఉన్నాయని ఐడీఎఫ్‌ పేర్కొంది. ఐడిఎఫ్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ ‘హమాస్‌పై దాడి చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ పేర్కొన్నారు.

గాజాలో భూ ఉపరితంపై దాడి చేయడానికి కచ్చితమైన సమయం నిర్ణయించే ప్రక్రియలో దేశ రాజకీయ నాయకత్వంతో ఐడీఎఫ్‌ కలసి పని చేస్తుందని ఆయన అన్నారు. కాగా ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యహూ మాట్లాడుతూ ‘ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఏకైక లక్ష్యం హమాస్‌ను పూర్తిగా అణిచివేయడమేనని, ఈ  లక్ష్యం సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం

 

Advertisement

What’s your opinion

Advertisement