అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు

17 Sep, 2023 16:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది.  

అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. 

కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.   

ఇదీ చదవండి: సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

మరిన్ని వార్తలు