ఒకరేమో ఏడు ముక్కలు చేయిస్తే.. మరొకరు ప్రియుడి చేతికి తుపాకీ అందించి..

22 Aug, 2022 12:39 IST|Sakshi

2021 నవంబర్‌.. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్తను ఏడు ముక్కలు చేయించింది జ్యోతినగర్‌ ప్రాంతానికి చెందిన హేమలత. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అతిగా మద్యం తాగించి ఆపరేషన్‌ చేసే సీజర్‌తో ప్రియుడితో ఏడు ముక్కలు చేయించి పలు ప్రాంతాల్లో పడేయించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఇష్టపడి సొంత మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్‌. ఇద్దరు పిల్లలు సంతానం. అయినా ప్రేమికుడి మోజులో పడిన ఆయన భార్య రవళి.. తాళికట్టిన రాజేందర్‌ను ఈనెల 20న పిస్తోల్‌తో కాల్పులు జరిపించి చంపించింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. 

గోదావరిఖని(పెద్దపల్లి): అర్థేచ.. కార్యేచ.. నాతి చరామి అంటూ చేతిలోచేయి వేసి జీవితాంతం తోడుంటామని బాస చేసిన కొందరు కట్టుకున్న భర్తను మట్టుబెట్టుతున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి తాళి కట్టిన వారిని కడతేర్చుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటనల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల ముందు తాళికట్టిన బంధాలు పలుచనైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచమంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తుంటే ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతివైపు పయనం పెరిగి పోతోంది.

 సింగరేణి కార్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. శనివారం హత్యకు గురైన కోరకొప్పుల రాజేందర్‌ను పెళ్లిచేసుకున్న రవళి ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాపురం చేయాల్సిన సమయంలో పెళ్లికి ముందునుంచే ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకుని తిరిగి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపించేందుకు సహకరించిందని అంటున్నారు. తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచిన భార్య ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు చంపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

 ఎన్టీపీసీ టీటీఎస్‌లో అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుముక్కలు చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను చంపించిన భార్య.. అతడి శరీరభాగాలను ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది. ఇలాంటి ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు.  భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలను బలోపేతం చేసేలా స మాజం నడుం బిగించాలంటున్నారు.  పోలీసుశాఖ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు