కూతురుతో కలిసి తల్లి భిక్షాటన

14 Sep, 2020 13:02 IST|Sakshi

కుటుంబ కలహాలతో భర్తకు దూరం

కేసు విచారణలో ఉండగానే భూమి కబ్జా

సాక్షి, సంగెం: ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా.. తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కూతురుతో కలిసి భిక్షాటన చేసింది ఓ మహిళ. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రంగరాజు అమరావతికి, మధుసూదన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో సదరు మహిళ 2012లో హన్మకొండలోని మహిళా పోలీసుస్టేషన్‌లో భర్త, బావ, అత్త, ఆడబిడ్డలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ఓ వైపు ఆ కేసు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్‌ రాజు.. బాధితురాలు పేరిట ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే అమరావతి తన కూతురుతో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు పరశురాములు, మహేందర్‌రెడ్డి వారిని అడ్డుకున్నారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయడం నేరమని వారించడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాధితురాలు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామానికి చేరుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు