World Malaria Day: ‘మలేరియా’తో జరపైలం.. నిర్లక్ష్యం చేస్తే

25 Apr, 2022 20:07 IST|Sakshi

ముందుజాగ్రత్త చర్యలతో రక్షణ

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం

 సాక్షి, మహబూబ్‌నగర్‌: జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది మలేరియా కావచ్చు. ప్రాణాంతకంగా మారొచ్చు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. కానీ వ్యాధి బారినపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు అత్యంత ముఖ్యం. సోమవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..  

వ్యాధి ఇలా సోకుతుంది..  
ఎనాఫిలిస్‌ అనే ఆడదోమ కుట్టినప్పుడు మనిషి శరీరంపై ప్లాస్మోడియం పొరసైట్‌ అనే పరాన్నజీవిని వదులుతుంది. దోమకాటు వల్ల ఏర్పడిన రంధ్రంలో నుంచి మనిషి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశించి విస్తరిస్తుంది. ఈ పరాన్నజీవి రక్తంలోని రోగనిరోధక వ్యవస్థగా ఉన్న ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. దీనిమూలంగా మనిషికి రోజువిడిచి రోజు జ్వరం సోకుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని పక్షంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగికి ప్రాణాంతకమవుతుంది. సుమారు 20రకాల ఎనాఫిలిస్‌దోమలు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి.

మలేరియా వ్యాధికి ప్రపంచంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మాడియం ఓవేల్‌ అనే నాలుగు రకాల పరాన్నజీవులు వ్యాధి తీవ్రతకు కారణమవుతున్నాయి. మనదేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం, పాల్సిపేరం అనే రెండు రకాల పరాన్నజీవులు కారణమవుతున్నాయి. వీటిలో ప్లాస్మోడియం పాల్సిపేరు అనే పరాన్నజీవి మలేరియా వ్యాధి తీవ్రతను పెంచి ప్రాణాంతకంగా మారుతోంది. నిరు నిల్వ ఉండే సంపులు, ఇతర నీటి పాత్రలు మురుగునీటి నిల్వ ప్రదేశాలు వ్యాధికారక దోమలకు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. వీటిలో దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి పెరిగి వ్యాధికారకంగా మారతాయి.

నివారణ మార్గాలివి..  
మలేరియా వ్యాధి రాకుండా నివారించడానికి ఎటువంటి టీకా మందులు లేవు. కేవలం దోమ కాటు నుంచి రక్షించుకోవడమే ప్రధాన మార్గం. మురుగు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలిన ఇంజిన్‌ఆయిల్, కిరోసిన్, డీడీటీ పౌడర్‌ను పిచికారీ చేయాలి. 5మి.లీ టెమిపాస్‌ 50శాతం ఇసీ మందును 10లీటర్ల నీటిలో కలిపి మురుగు కాల్వలు, వర్షపు నీటి గుంతలు, బోర్లు, నల్లాల వద్ద ఏర్పడే నీటి గుంతల, ఖాళీ చేయలేని నీటినిల్వ సంపులు, డ్రమ్ములలో పంచాయతీ సిబ్బంది పిచికారీ చేయాలి. ఈ ద్రావణం తినుబండారాలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్‌ ట్యాంకుల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని మారుస్తూ ఉండాలి. సంపులపై ట్యాంకులపై మూతలు పెట్టాలి.

వారానికి ఒకసారైనా శుభ్రం చేయడం వల్ల లార్వా ఉంటే చనిపోతుంది. పాతటైర్లు, పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. పడుకునే సమయంలో దోమతెరలు వాడాలి. దోమలను తరిమి వేసే కాయిల్స్‌ వంటివి ఉపయోగించాలి. ఇంట్లో కర్టెన్లు తరచూ మారుస్తూ ఉండాలి కిటికీలకు జాలీలను అమర్చుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చాలావరకు నివారించవచ్చు. కలుషిత నీటి ముప్పును ఎదుర్కొనేందుకు కాచి వడబోసిన నీటిని తాగటం చాలా అవసరం. ఫిల్టర్లు వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కాచి చల్లార్చి వడబోసిన నీళ్లే ఎక్కువ సురక్షితం.

మరిన్ని వార్తలు