వెంకటగిరికి జాతీయ ఖ్యాతి

16 Oct, 2023 13:46 IST|Sakshi

తిరుపతి అర్బన్‌: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి వస్త్రాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. వెండి జరీ, ఆఫ్‌ఫైన్‌ జరీలను అమర్చి ప్రత్యేక శైలిలో చీరలు నేయడం ద్వారా ఇక్కడి చేనేత పరిశ్రమ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందింది. వెంకటగిరి చీరలను 17వ శతాబ్దంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు.

చీరకు రెండు వైపులా ఒకే డిజైన్‌ కనిపించే జాందనీ వర్క్‌తో నేయడంతోపాటు కాటన్‌ చీరలు చుట్టూ చంగావి రంగు చీరల తయారీకి వెంకటగిరి ప్రసిద్ధి. ఇక్కడ 22 సంఘాలు, 660 మంది సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనల్లో, ఆప్కో వస్త్రాలయాల్లో ఈ చీరలకు మంచి డిమాండ్‌ ఉంది.

చీరల తయారీ విధానం ఇలా
వెంకటగిరి చేనేత కార్మికులు చీరల తయారీలో క్రమపద్ధతి పాటిస్తుంటారు. ప్రధానంగా హాంక్‌ (చిలప) రూపంలో పత్తి, వెండి, బంగారు జరీలు, నాప్తాల్‌తోపాటు పత్తి శుద్ధీకరణ చేస్తారు. మరోవైపు హాంక్‌ కాటన్‌ను ఉడకబెట్టి, రాత్రంతా నానబెట్టి, కడిగి, రంగులు అద్దుతారు. అంతేకాకుండా తెల్ల చీరలకు బ్లీచింగ్‌ టెక్నిక్‌ని వాడడం, మానవ మూలకం, గ్రాఫ్‌ పేపర్‌ డిజైన్‌తోపాటు నేసిన వాటిలో లోపాలను సరిచేయడానికి మాస్టర్‌ వీవర్‌ ద్వారా తనిఖీ చేపట్టి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడం వీరి ప్రత్యేకత.

వెంకటగిరికి ఢిల్లీ బృందం
కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఇన్వెస్ట్‌ ఇండియా కమిటీ పర్యవేక్షణలో చేతివృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యత సాధించడంతోపాటు గుర్తింపు పొందిన రంగాలకు ఈ ఏడాది నుంచి జాతీయస్థాయి అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన రాష్ట్రం నుంచి 12 రంగాలను ఎంపిక చేశారు. అందులో ముందు వరుసలో వెంకటగిరి చేనేత పరిశ్రమను జాతీయ అవార్డు పోటీలకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్‌ ఇండియా కమిటీ ప్రతినిధి జిగీష తివారీ మిశ్రా నేతృత్వంలో ఓ బృందం ఈనెల 17వ తేదీ (మంగళవారం) వెంకటగిరిలో పర్యటించనుంది. వస్త్రాల నాణ్యతా, ప్రమాణాలపై నివేదిక రూపొందించనుంది.

మరిన్ని వార్తలు