ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Published Fri, Nov 10 2023 4:52 AM

స్వామి,అమ్మవార్లకు స్నపన తిరుమంజనం - Sakshi

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మూడు రోజుల పవిత్రోత్సవాలు గురువారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అంతకుముందు వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అర్చకులు నారాయణాచార్యుల చేతులమీదుగా ఆచార్య రుత్విక్‌వరణం జరిగింది. సాయంత్రం స్వామి, అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు యాగ శాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

ఆర్జిత సేవగా పవిత్రోత్సవం

గృహస్తులు(ఇద్దరు) రూ.516 చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో గురువారం ఆర్జిత సేవలు రద్దు చేశా రు. శుక్రవారం, శనివారం కూడా కల్యాణోత్సవం, తిరుప్పావడ సేవలు రద్దు చేసినట్లు ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి తెలిపారు.

Advertisement
Advertisement