శ్రీవారి దర్శనానికి 8 గంటలు

11 Nov, 2023 00:46 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం అర్ధరాత్రి వరకు 56,723 మంది స్వామివారిని దర్శించుకోగా 21,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

చెకుముకి పరీక్షకు

విశేష స్పందన

తిరుపతి ఎడ్యుకేషన్‌: చెకుముకి సైన్స్‌ సంబరాలు–2023లో భాగంగా శుక్రవారం జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో పాఠశాల స్థాయిలో నిర్వహించిన చెకుముకి పరీక్షకు విశేష స్పందన లభించిందని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రెడ్డెప్ప తెలిపారు. జిల్లా విద్యాశాఖ సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు 25వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నట్టు వెల్లడించారు. పాఠశాల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మండల, జిల్లా స్థాయిలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. చెకుముకి పరీక్ష నిర్వహణకు సహకరించిన జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ వీ.శేఖర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పంట పొలాలపై ఏనుగుల దాడి

పాకాల: మండలంలోని ఈ–పాలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం స్థానిక రైతులు మాట్లాడుతూ పంటలపై రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసిందని, పెద్ద శబ్దాలు చేయగా.. ఏనుగులు అడవిలోకి పారిపోయాయని తెలిపారు. ఏనుగుల దాడిలో వెంకటరామాపురానికి చెందిన బాలరాజునాయుడు, పాలగుట్టపల్లి చెందిన రఘునాథరెడ్డి, గురప్పనాయుడులు సాగు చేసిన వరి, టమాట, అరటి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ప్రయాణికులతో

మర్యాదగా వ్యవహరించండి

తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి బస్టాండ్‌కి చెందిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈడీ గిడుగు వెంకటేశ్వుర్లు రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌ను పరిశీలించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్గో వ్యాపారాన్ని విస్తరించాలని వెల్లడించారు. ఈ సమీక్షలో డెప్యూటీ సీటీఎం భాస్కర్‌రెడ్డి, ఏటీఎం రామచంద్రనాయుడు, డిపో మేనేజర్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల

జాబితా రూపొందించాలి

తిరుపతి అర్బన్‌: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాలతోపాటు వర్నలబుల్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితాను స్పష్టంగా సిద్ధం చేయాలని ఆర్డీవో నిషాంత్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. తమ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన అధికారులతోపాటు చంద్రగిరి నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అతిక్రమిచిన వివరాలు, కేసులు నమోదు చేసిన వివరాలు సిద్ధంగా ఉంటేనే బైండ్‌ ఓవర్‌ చేయడానికి వీలుంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు