Sakshi News home page

బ్రహ్మాండంగా చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు

Published Sat, Nov 11 2023 12:46 AM

- - Sakshi

సూళ్లూరుపేట: పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అవినీతికి తావులేకుండా, ఎంతో పారదర్శకంగా నిర్వహించినట్టు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. శుక్రవారం అమ్మవారి ఆలయ పరిధిలోని కల్యాణ మండపంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి జమా ఖర్చుల విషయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించి జరిగిన బ్రహ్మోత్సవాల విషయంలో ఏం జరిగిందో చెప్పమని కోరారు. ఈ సందర్భంగా వారు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఎంతో పారదర్శకంగా తన సొంత నిధులను కూడా వెచ్చించి తిరునాళ్లును జరిపించారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ స్థానికుల మనోభావాలకు అనుగుణంగా తిరునాళ్లను జరిపించడంలో బాలచంద్రారెడ్డి సక్సెస్‌ అయ్యారన్నారు. ఆయన చేసిన కృషి వల్లే ఆలయానికి సమీపంలో సుమారు పది ఎకరాలకు పైగా పొలం సేకరించి దాన్ని తన సొంత నిధులతో చదును చేసి గ్రౌండ్‌గా తీర్చిదిద్దారన్నారు. అదేవిధంగా ఆలయానికి ఎదురుగా ఉన్న లెప్రసీ కాలనీకి ఎదురుగా ఉన్న వారికి వట్రపాళెంలో ఇళ్లు నిర్మించి ఇచ్చి అక్కడ ఖాళీ చేసి గాలిగోపురాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అనంతరం ఆలయ చైర్మన్‌ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలకు సంబంధించి సుమారు 360 మంది దాతలు రూ.5 వేల నుంచి రూ.10 లక్షల దాకా ఇచ్చారన్నారు. తిరునాళ్లుకు సంబంధించి రూ.2,98,81,459 కోట్లు విరాళాలుగా రాగా.. రూ.3,61,42,317 కోట్లు ఖర్చయిందని చెప్పారు. రూ.62,60,858 లక్షలు తక్కువ రావడంతో తన సొంత నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు శ్వేతపత్రం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆలయానికి సంబఽంధించి కాళంగినది ఒడ్డున గాలిగోపురం, స్నానాల ఘాట్‌, ఆలయం వెనుకవైపు కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే కాళంగినదిపై నాలుగులేన్ల వంతెన నిర్మించేందుకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పించి రూ.35 కోట్లు మంజూరు చేయించినందకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసులురెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్‌రెడ్డి, వంకా దినేష్‌కుమార్‌, కర్లపూడి సురేష్‌కుమార్‌, ఓలేటి బాలసత్యనారాయణ, ఎంఎం పద్మజ, నాయుడుకుప్పం నాగమణి, చెల్లమ్మ, టీడీపీ నాయకులు వేనాటి సురేష్‌రెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement