కొనుగోళ్ల జాడేది?

4 May, 2023 04:36 IST|Sakshi
బొంరాస్‌పేట మండలంలో పొలంలో ఆరబెట్టిన ధాన్యం

బొంరాస్‌పేట: జిల్లాలో వరి పంట చేతికొచ్చి నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. రైతులు వరి కోతల పనుల్లో నిమగ్నమయ్యారు. యంత్రాలు, కూలీల సహాయంతో కోతలు కొనసాగుతున్నాయి. వాతావరణంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరి రైతుల్లో ఆత్రుత మరింత ఎక్కువైంది. ఆదరాబాదరాగా కోతల్లో వరిరైతు కుటుంబాలు బిజీ అయ్యారు. పండించిన ధాన్యాన్ని మార్కెటుకు వెళ్లి అమ్ముకునేందుకు ఇదివరకు మండలంలోని ఆయా గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. కానీ ఈఏడాది వరిసీజన్‌ ప్రారంభమైనా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల జాడలేదు.

120 కేంద్రాలు..

ఇదివరకు ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. బొంరాస్‌పేట మండలంలోని బొంరాస్‌పేట, నాగిరెడ్డిపల్లి, మెట్లకుంట, ఏర్పుమళ్ల తదితర గ్రామాల్లో మొత్తం 16 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ మద్దతు ధరకు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా రైతులకు మేలుకరంగా కేంద్రాలుండేవి. ప్రభుత్వ మద్దతు ధరకు కల్పించి దళారి వ్యవస్థ లేకుండా ఉండేందుకుగానూ వరికొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేవారు. ఈసారి క్వింటాలుకు రూ.2060 వరకు మద్ధతు ధర ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికై నా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు కొనుగోళ్లు చేయాలని వరి రైతులు కోరుతున్నారు.

అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తుంటే.. అధికారులు మాత్రం ఇంకా వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలేదు.చేతికొచ్చిన పంట నీటి పాలుకాకుండా రైతన్న పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.. సీజన్‌ ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

పైన మొగులు.. వరి రైతుల్లో గుబులు

జోరుగా నూర్పిడి పనులు

కానరాని కొనుగోళ్ల కేంద్రాలు

చర్యలు చేపట్టని అధికారులు

వారం రోజుల్లో ఏర్పాటు

వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇటీవల ఐకేపీవారికి సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారులకు, సిబ్బందికి త్వరలో సమావేశం నిర్వహిస్తారు. మరో వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడు రకానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ఉంటుంది.

– పద్మావతి,

వ్యవసాయాధికారి, బొంరాస్‌పేట

మరిన్ని వార్తలు