నగరంలో భద్రత కట్టుదిట్టం

9 Nov, 2023 00:22 IST|Sakshi
కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌

పోలీస్‌ కమిషనర్‌

రవిశంకర్‌

దొండపర్తి: సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచిన ప్రాంతాల పరిధి మరింత పెంచాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ కార్యాలయంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను బుధవారం సీపీ సందర్శించారు. కంట్రోల్‌ రూమ్‌ నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. ముఖ్యంగా డయల్‌ 112కు వస్తున్న కాల్స్‌ తీసుకొని వాటిని సంబంధిత స్టేషన్లు, అధికారులకు ఎంత సమయంలో తెలియజేసి సమస్యను పరిష్కరిస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. ఆ కాల్స్‌ రికార్డును భద్రపరుస్తున్న విధానంలో పలు సూచనలు చేశారు. పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులు, వాటిని డిస్పోజ్‌ చేస్తున్న తీరును గమనించారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి సెట్ల ద్వారా అన్ని పోలీస్‌ స్టేషన్లు, పోలీస్‌ కార్యాలయాలకు ఎంత స్పష్టంగా సమాచారం చేరుతోందన్న విషయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి బ్లూకోట్స్‌, నైట్‌ రౌండ్‌, రోడ్‌ సేఫ్టీ, ఇతర పోలీసు మొబైల్స్‌ ఏయే ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నాయో జీపీఎస్‌ ద్వారా గమనిస్తున్న విధానం తెలుసుకుని పలు సూచనలు చేశారు. దిశ ఎస్‌వోఎస్‌ పనిచేస్తున్న తీరును గమనించారు. కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న సిబ్బంది విభాగాల వారీగా నిర్వహిస్తున్న విధులు తెలుసుకుని, వారి విద్యార్హతలు, పనితీరు పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నగర పరిధిలోని ముఖ్య కూడళ్లలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచి నగర భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు