ఇన్‌స్టాగ్రామ్‌ పిచ్చిలో దొంగగా మారిన జూనియర్‌ ఆర్టిస్ట్‌

3 Mar, 2024 08:52 IST|Sakshi

దొండపర్తిలో బంగారు నగల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

నగలు అమ్మి కారులోన్‌, క్రెడిట్‌ కార్డు అప్పు తీర్చిన మహిళ

40 తులాలు స్వాధీనం, షేర్‌ మార్కెట్‌లోను పెట్టుబడులు

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

సీతమ్మధార : ఇన్‌స్ట్రాగాం ఇన్‌ఫ్లుయన్సర్‌గా యువతితో పరిచయం చేసుకుంది. స్నేహం పెరగడంతో ఇంటికి వెళుతూ వచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో బంగారం ఉన్నట్లు కనిపెట్టింది. బాత్‌రూమ్‌ పేరుతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నాలుగు దఫాలలో 74 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. దొండపర్తిలో జరిగిన ఈ చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చాకచక్యంగా కిలేడిని పట్టుకొని కటకటాల్లోకి పంపించారు.

వివరాల్లోకి వెళితే.. దొండపర్తి ప్రాంతంలో బాలాజీ మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నెంబర్‌ 102లో రిటైర్డ్‌ పోస్టల్‌ అధికారి జనపాల ప్రసాద్‌బాబు కుటుంబంలో కలిసి నివాసముంటున్నారు. అతని కుమార్తెకు ఇన్‌స్ట్రాగాంలో రీల్స్‌ చేయడంపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో 2016లో ఇన్‌స్ట్రాగాం ద్వారానే కిళ్లంపల్లి సౌమ్యశెట్టి పరిచయమైంది. సౌమ్య కూడా ఇన్‌స్టా, యూట్యూబ్‌ వీడియోలు చేస్తుండేది. అలాగే జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసేది. దీంతో కొన్నాళ్లు ఇద్దరూ వీడియో చేసేవారు. అయితే సౌమ్య సినిమాల్లో బిజీ అవడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. అయితే కొద్ది నెలల క్రితమే సదరు యువతికి సౌమ్య నుంచి ఇన్‌స్టా మళ్లీ మెసేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ ఇద్దరు మాట్లాడుకోవడంతో పాటు ఒకరి ఇంటికి వెళుతూ వచ్చేవారు.

నాలుగు దఫాలలో 74 తులాల చోరీ
ప్రసాద్‌బాబు ఇంట్లో బంగారు నగలు ఉన్నట్లు సౌమ్య గుర్తించింది. వాటిని కాజేయడానికి ఎత్తు వేసింది. ఈ ఏడాది జనవరి 29న అతని ఇంటికి వెళ్లి బెడ్‌ రూమ్‌లో ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పి రూమ్‌ గడియ పెట్టుకుంది. బాగా పరిచయమవడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆమె బీరువాలో ఉన్న బంగారు నగల్లో కొన్నింటిని దుస్తుల్లో పెట్టుకొని తీసుకెళ్లిపోయింది.

ఇలా ఫిబ్రవరి 2, 6, 19 తేదీల్లో వారి ఇంటికి వెళ్లి అవకాశం ఉన్నంత వరకు నగలను తస్కరించింది. ఇలా మొత్తంగా 74 తులాలు చోరీ చేసింది. అప్పటికీ ప్రసాద్‌బాబు కుటుంబ సభ్యులు గుర్తించలేదు. గత నెల 23వ తేదీన పెళ్లికి వెళ్లేందుకు బీరువా తీసి నగలు చూడగా కనిపించలేదు. వెంటనే ప్రసాద్‌బాబు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీసీపీ(క్రైమ్‌) వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్‌, ఇతర పోలీస్‌ అధికారులు వారి ఇంటికి వెళ్లి బీరువా పరిశీలించారు.

బ్యాంక్‌ లావాదేవీలు పట్టించాయి..
ఇంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటికి ఎవరెవరు వచ్చారన్న విషయాన్ని ఆరా తీశారు. వారందరిపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా సౌమ్యను కూడా విచారించారు. ముందు ఎటువంటి ఆధారాలు లభించలేదు.అయితే అందరి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు పరిశీలిస్తే.. సౌమ్య బ్యాంక్‌ ఖాతాలో జరిగిన లావాదేవీలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను తమ పద్ధతిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించింది. ఆ నగల్లో కొన్నింటిని విక్రయించి కుటుంబంతో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కార్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డుల బ్యాలెన్సులు కట్టడంతో పాటు షేర్‌మార్కెట్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని శనివారం అరెస్టు చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు