ఉత్సాహంగా.. ఉగాది

23 Mar, 2023 01:08 IST|Sakshi
జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణానికి హాజరైన భక్తులు

పచ్చటి తోరణాలతో

కళకళలాడిన ఇళ్లు, దుకాణాలు

భక్తులతో ఆలయాలు కిటకిట

సాయంత్రం పంచాంగ శ్రవణాలు

వనపర్తి క్రైం: శోభకృత్‌ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునే ఇళ్ల లోగిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి పసుపు, కుంకుమ, పచ్చటి మామిడాకు తోరణాలతో ఇంటి, దుకాణ గుమ్మాలను అలంకరించారు. ఇళ్లలో ఉన్న దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తయారు చేసిన ఉగాది పచ్చడి, చేసిన వంటలను నైవేద్యంగా సమర్పించారు.

ఆలయాలు కిటకిట..

పండుగ సందర్భంగా జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర దేవాలయం, న్యూగంజ్‌లోని గణపతి దేవాలయం, రామాలయం, చింతల హనుమాన్‌ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పిల్లాపాపలతో ఇంటిల్లిపాది కలిసి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇదిలా ఉండగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన పల్లకీసేవలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, నాయకులు ఉంగ్లం తిరుమల్‌, ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు పాల్గొన్నారు.

పంచాంగ శ్రవణాలు..

జిల్లాకేంద్రంలోని పాండురంగస్వామి, వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, రామాలయంలో సాయంత్రం పంచాంగ శ్రావణం నిర్వహించారు. వేదపండితులు ఓరుగంటి మనోహర్‌శర్మ, ఓరుగంటి నాగరాజుశర్మ శోభకృత నామ సంవత్సర పంచాంగం చదివి వినిపించారు. ఈ సంవత్సరంలో వ్యవసాయం, వర్షాలు, పంటలు తదితర వాటి పరిస్థితి ఎలా ఉంటుందో వివరించారు. శారదనగర్‌కాలనీ శారదమ్మ ఫంక్షన్‌హాల్‌లక్ష బ్రాహ్మణ సంఘం సభ్యులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పంచాంగాన్ని ఆవిష్కరించారు.

పంచాంగాల పంపిణీ..

శ్రీరంగాపూర్‌: మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని బుధవారం పంచాంగాలను పంపిణీ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు విష్ణునారాయణ శర్మ తెలిపారు. వేద పండితుడు ఓరుగంటి మనోహరశర్మ సిద్ధాంతి రచించిన పంచాంగాలను రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహకారంతో ముద్రించి ఆలయాల్లో పూజలు చేసే అర్చకులకు అందజేయాలని రావుల సూచించారని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌, సితార వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎద్దులబండ్ల ఊరేగింపు..

ఖిల్లాఘనపురం: గ్రామాల్లో రైతులు కాడెద్దులకు స్నానాలు చేయించి భక్షాలు పెట్టి పూజలు చేశారు. పొలాల్లో వ్యవసాయ సామగ్రికి పూజలు చేసి సాగు పనులు ప్రారంభించారు. మండల కేంద్రంలోని కుమ్మరిగేరి, మల్క్‌మియాన్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయాల వద్ద ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపు నిర్వహించారు. గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పల్లకీసేవ నిర్వహించారు. అప్పారెడ్డిపల్లిలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని గోపాలస్వామి, గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు పలు గ్రామాల్లో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు