క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి | Sakshi
Sakshi News home page

క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి

Published Mon, Dec 25 2023 12:52 AM

- - Sakshi

వనపర్తి: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో అండర్‌–17 కరాటే పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గెలుపొందిన వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు, ఓటమిని చవిచూసిన క్రీడాకారులు లోపాలను సరిచేసుకొని గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ గుర్తింపు పొందుతారని తెలిపారు. పోటీల్లో నైపుణ్యాలను ప్రదర్శించాలని, పట్టుదలతో సాధన చేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయటం చాలా సులువనే విషయాన్ని శిక్షణలో శిక్షకులు నేర్పించాలన్నారు. పోటీల్లో హైదరాబాద్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్‌, ఆసీఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల తదితర ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నట్లు కరాటే అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చింతకాయల విజయ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజయ్‌, రహమతుల్లా, శేఖర్‌, రాము, సురేందర్‌, రాఘవేంద్ర నరేందర్‌, కోచ్‌ జంపన్న, కౌన్సిలర్‌ చీర్ల సత్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జీపీ కార్మికులకు

ఉద్యోగ భద్రత కల్పించాలి

చిన్నంబావి: రాష్ట్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న 50 వేల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్‌ కోరారు. ఆదివారం మండలకేంద్రంలో జరిగిన ప్రథమ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామపంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు, హక్కులు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధానకార్యదర్శిగా గోవిందమ్మ, సభ్యులుగా నర్సింహ, పద్మ, బాలపీరు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి కురమ్మయ్య, గణేష్‌, బాలపీరు, రవి, అభిశాలి, గోవిందు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి

Advertisement
Advertisement