చేనేత.. చేయూత | Sakshi
Sakshi News home page

చేనేత.. చేయూత

Published Mon, Dec 25 2023 12:52 AM

అమరచింతలో మగ్గంపై జరిచీర నేస్తున్న కార్మికులు (ఫైల్‌) 
 - Sakshi

కార్మికుల వివరాల నమోదుకు టీ–నేతన్న యాప్‌

అమరచింత: చేనేత కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో కార్మికులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకొనే వీలు కల్పించింది. ఇందుకోసం కొత్తగా ‘టి–నేతన్న’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఎలా వినియోగించాలో సంబంధిత చేనేత క్లస్టర్లు, చేనేత సహకార సంఘాల ద్వారా నేత కార్మికులకు అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నల కోసం అందిస్తున్న వివిధ పథకాల రాయితీ డబ్బులను నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు చేనేత, జౌళిశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలోని అమరచింత, వెల్టూర్‌, కొత్తకోట, తిప్పడంపల్లి, ఖిల్లాఘనపురం, తూంకుంటలో కార్మికులు చేనేత, ఉన్ని వస్త్రాలను తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో జియోట్యాగింగ్‌ ఉన్న కార్మికులు 407 మంది ఉండగా.. వీరికి ప్రభుత్వపరంగా అందాల్సిన రాయితీలతో పాటు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.

నేతన్నకు వర్తించే పథకాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నేతన్నల సంక్షేమానికి చేనేత చేయూత. చేనేత మిత్ర, త్రిఫ్ట్‌ ఫండ్‌, నేతన్నకు బీమా, ఆరోగ్య బీమా, 45 ఏళ్లు నిండిన కార్మికులకు ఆసరా పింఛన్‌తో పాటు సామగ్రి కొనుగోలుకు రాయితీలు వర్తించనున్నాయి. నూలు, పట్టు కొనుగోలుకు ఇచ్చే రాయితీ డబ్బులు సైతం నేరుగా నేతన్నల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేసేలా సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో మగ్గాలపై జరి చీరలు, నూలు వస్త్రాలు తయారుచేసే కార్మికుల వివరాలను నాలుగేళ్ల కిందట అధికారులు గుర్తించారు. వారందరికి మగ్గాలు ఉన్నాయా లేవా పరిశీలించి మగ్గానికి ముగ్గురు చొప్పున కార్మికులను గుర్తించి జియోట్యాగింగ్‌ చేస్తూ నంబర్లు కేటాయించారు. అమరచింతలో 245 మంది, వెల్టూర్‌లో 100, కొత్తకోటలో 33, ఖిల్లాఘనపురంలో 12, తూంకుంటలో 10, తిప్పడంపల్లిలో ఏడుగురు కార్మికులు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరితో పాటు అనధికారికంగా మరో 300 మంది కార్మికులు చిన్న చిన్న నేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆయా గ్రామాల్లోని కార్మిక సంఘాలు నాయకులు

వెల్లడించారు.

గడువు పొడిగించాలి..

టి–నేతన్న యాప్‌లో వివరాల నమోదుకు ఈ నెల 30 వరకు అధికారులు గడువు విధించారు. చాలామంది కార్మికులు ఇప్పటి వరకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. నెలరోజులు పొడిగిస్తే బాగుంటుంది.

– దేవరకొండ లచ్చన్న, అమరచింత

ఈ నెల 30 చివరి గడువు..

చేనేత కార్మికులు టి–నేతన్న యాప్‌లో తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రతి కార్మికుడు తన ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని జియోట్యాగింగ్‌తో పాటు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉంది. దీనిపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం.

– గోవిందయ్య, ఏడీఏ, గద్వాల

వివరాల నమోదు ఇలా..

మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికుడు తన సొంత ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌ ద్వారా టి–నేతన్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వ్యక్తిగత ఈ–మెయిల్‌, పాస్‌వర్డ్‌ను నిర్ధారించుకొని యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. మగ్గంపై నేస్తున్న ఫొటోతో పాటు జియోట్యాగింగ్‌ నంబర్‌ను అప్‌లోడ్‌ చేయాలి. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబసభ్యుల వివరాలు సైతం నమోదు చేసుకుంటే ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు వర్తిస్తాయని జౌళిశాఖ అధికారులు తెలిపారు. వీటితోనే వ్యక్తిగత గుర్తింపుకార్డుతో పాటు ఇతర ధ్రువపత్రాలు సైతం పొందే అవకాశం ఉందంటున్నారు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఇంటి నుంచే వివరాల నమోదుకు అవకాశం

ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వ పథకాల వర్తింపు

జిల్లాలో407 మంది కార్మికులు

టి–నేతన్న యాప్‌
1/3

టి–నేతన్న యాప్‌

2/3

3/3

Advertisement
Advertisement