బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా..

15 Oct, 2023 11:10 IST|Sakshi

దుగ్గొండి: ‘అమ్మా నాన్న జాగ్రత్త.. బతుకమ్మ ఆడుకునే సమయానికి ఇంటికి వస్తా’ అని ఫోన్‌లో మాట్లాడిన కొద్ది సేపటికే ఆ చదువుల తల్లి అనంత లోకాలకు వెళ్లిపోయింది. గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురై మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి విజయ–లింగయ్య దంపతుల కుమార్తె ప్రవళిక (22) ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక తిరిగిరాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విజయ–లింగయ్య దంపతులు.. కుమార్తె ప్రవళిక, కుమారుడు ప్రణయ్‌కుమార్‌ను ఉన్నంతలో బాగా చదివిస్తున్నారు. ప్రవళిక హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. సంవత్సరం నుంచి హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు తల్లిదండ్రులతోపాటు సోదరుడు ప్రణయ్ కుమార్, శాయంపేట మండలం నేరేడుపల్లిలోని తన అమ్మమ్మతో ఫోన్‌లో మాట్లాడింది.

అన్నం తిన్నారా? అని అడిగింది. బతుకమ్మ ఆడుకోవడానికి శనివారం సాయంత్రం వరకు ఇంటికి వస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. పరీక్షలు వాయిదా పడి మనస్తాపానికి గురై ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే పిడుగులాంటి వార్త వారికి చేరింది. ఇప్పుడే తమ కూతురు ఫోన్‌లో మాట్లాడి విగత జీవిగా మారిందని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

పోలీసులే సమాధానం చెప్పాలి..
మా అక్క చదువులో నాకన్నా చురుకైంది. గ్రూప్‌– 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ అవుతోంది. పరీక్షలు వాయిదా పడడంతో కొంత ఆందోళన చెందినప్పటికీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. మేం హైదరాబాద్‌ వెళ్లే వరకే చనిపోయి ఉంది. రాత్రే పోస్టుమార్టం చేశారు. అసలు ఎలా చనిపోయిందో, సూసైడ్‌ లెటర్‌ ఒకటని, రెండని పోలీసులు చెబుతున్నారు. వారే నిజాలతోపాటు సమాధానం చెప్పాలి.
– మర్రి ప్రణయ్‌కుమార్‌, ప్రవళిక సోదరుడు

మరిన్ని వార్తలు