TS Election 2023: రాహుల్‌, ప్రియాంకగాంధీ పర్యటన.. కాంగ్రెస్‌ కేడర్‌లో కొత్త ఉత్సాహం!

19 Oct, 2023 14:06 IST|Sakshi
ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన

ఆదివాసీ గడ్డ రామాంజాపూర్‌ నుంచి ఎన్నికల శంఖారావం!

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..

అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభం..

సభలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలపై అన్నాచెల్లెళ్ల నిప్పులు

ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు భరోసా!

నేడు భూపాలపల్లిలో నిరుద్యోగులతో కలిసి బైక్‌ ర్యాలీ..

పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపిన రాహుల్‌, ప్రియాంకగాంధీ..

భూపాలపల్లికి చేరుకున్న రాహుల్‌గాంధీ

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్‌ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. ములుగు జిల్లా రామాంజాపూర్‌ వద్ద బుధవారం జరిగిన విజయభేరి సభలో తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అభ్యర్థులను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకగాంధీ కాకతీయులు ఏలిన గడ్డ నుంచే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాహుల్‌, ప్రియాంక రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న వారు అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బస్సుయాత్ర ప్రారంభించారు.

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్సుయాత్ర ద్వారా రామప్ప ఆలయం నుంచి రామాంజాపూర్‌ విజయభేరి సభ వద్దకు చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు కూటమిగా పని చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే విపక్ష నేతలందరిపై సీబీఐ, సీఐడీ, ఈడీ దాడులు చేయించి కేసులు పెట్టిన కేంద్రం అవినీతికి కేరాఫ్‌గా మారిన కేసీఆర్‌పై ఒక్క కేసు పెట్టలేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై దుమ్మెత్తి పోశారు. బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించిన ప్రియాంకగాంధీ అధికారంలోకి వచ్చాక ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామన్నారు.

18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలను ఇస్తామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు అన్నాచెల్లెళ్లు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో అమలు చేయనున్నామని ప్రకటించారు. రాహుల్‌ ప్రసంగిస్తున్న సమయంలో పీఎం.. పీఎం రాహుల్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేతల పర్యటన సందర్భంగా ములుగు ఎస్పీ గాష్‌ ఆలం భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

'ఆదివాసీ గిరిజనులతోపాటు అందరికీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్దది. దేశంలో మేం అధికారంలోకి వస్తే జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం.' – రాహుల్‌గాంధీ

రామప్పలో పూజలు..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సందర్శించారు. రామప్పకు సాయంత్రం 4 గంటలకు వారిద్దరు రావాల్సి ఉండగా, 37నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆలయ ఆర్చకులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు ఆశీర్వచనం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఆలయం చుట్టూ కలియదిరిగారు. టూరిజం గైడ్‌ విజయ్‌కుమార్‌ ఆలయ విశిష్టత గురించి వివరించారు.


జనసంద్రంగా మారిన రామాంజాపూర్‌..
రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరైన కాంగ్రెస్‌ విజయభేరి సభ సందర్భంగా రామాంజాపూర్‌ జనసంద్రంగా మారింది. ఇటు సీతక్క, అటు గండ్ర సత్యనారాయణ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావడంతో గ్రామ పరిసరాలు కార్యకర్తలతో హోరెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన దొడ్ల, మొండాయి, మల్యాల, మేడారం, ఊరట్టం తదితర గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సీతక్కను దగ్గరకు తీసుకుని ఈమె ఎవరో తెలుసా.. నా సోదరి అంటూ నాలుగు సార్లు ఉచ్ఛరించి సభలో నూతన ఉత్తేజాన్ని నింపారు. కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలపై ప్రజలను అభిప్రాయాన్ని అడగ్గా.. సానుకూలంగా స్పందించారు.

సభలో పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, డి.శ్రీధర్‌రాబు, నాయకులు మధుయాష్కీగౌడ్‌, మల్లు రవి, తూర్పు జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ, కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాఘవరెడ్డి, పొదెం వీరయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, మల్లాడి రాంరెడ్డి పాల్గొన్నారు.

స్వాగతం పలికిన రాష్ట్ర నేతలు
రామప్పలోని హెలిపాడ్‌ వద్ద అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బొకేలు అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయం ముందు అగ్రనేతలకు కోయ కళాకారులు కొమ్ము డాన్స్‌, గిరిజనులు లంబాడా నృత్యం ద్వారా స్వాగతం పలికారు.

కేటీపీపీ అతిథి గృహంలో బస..
రాహుల్‌, ప్రియాంకగాంధీ బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. చెల్పూరు కేటీపీపీ అతిథి గృహంలో బస చేశారు. ప్రత్యేక గదిలో రాహుల్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రస్థాయి నాయకులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం డైనింగ్‌ హాల్‌లో రాత్రి భోజనంలో కొంచెం బిర్యానిని టేస్ట్‌ చేసి మటన్‌ కబాబ్‌ తీసుకున్నారు. అలాగే చిన్న పుల్కాతో పాలక్‌ పప్పు తీసుకొని భోజనాన్ని ముగించారు.

రాహుల్‌గాంధీ గురువారం ఉదయం 7 గంటలకు కేటీపీపీ అతిథి గృహం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులతో మాటాముచ్చట చేసి, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాకు వెళ్తారు.
ఇవి చదవండి: ప్లాట్ల విక్రయంలో.. బోథ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్‌ కేసు!

Follow the Sakshi TV channel on WhatsApp:

మరిన్ని వార్తలు