భార్య ఆత్మహత్య కేసులో.. భర్తకు యావజ్జీవ శిక్ష

14 Dec, 2023 08:07 IST|Sakshi
ముద్దాయి జక్కి ప్రసాద్‌ (ఫైల్‌)

వైఎస్సార్‌: పెళ్లికి ముందు ఒప్పుకున్న మేరకు కట్నం డబ్బులు ఇవ్వలేదంటూ భార్యను మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన సంఘటనలో భర్త జక్కి ప్రసాద్‌కు ప్రొద్దుటూరు సెకండ్‌ ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలం కొత్తపల్లెకు చెందిన వెంకటనరసమ్మ, యానాదయ్య కుమార్తె రాజరాజేశ్వరి (21)కి 2010లో అదే మండలానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.

అయితే భర్త తాగుడుకు బానిస కావడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకొని విడిపోయారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత రాజరాజేశ్వరి ప్రొద్దుటూరులోని ఆదర్శ కాలనీలో ఉంటున్న తన అవ్వగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో అదే వీధిలో ఉంటున్న జక్కి ప్రసాద్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోగా అందుకు పెద్దలు అంగీకరించారు. పెళ్లైన మూడు నెలల తర్వాత కట్నకానుల కింద మాట్లాడుకున్న ఐదు తులాల బంగారును ఇచ్చేలా పెద్దలు మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో ఇరువురి పెద్దలు, బంధువుల సమక్షంలో 2016 మే 22న పెంచలకోనలో వారి పెళ్లి జరిపించారు. మూడు నెలల తర్వాత పెళ్లికి ముందు మాట్లాడుకున్న కట్నం డబ్బు ఇవ్వాలంటూ భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆమెను వేధించసాగారు. వారి వేధింపులను భరించలేని రాజరాజేశ్వరి అదే ఏడాది జూలై 7న సాయంత్రం ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంకటనరసమ్మ ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పటి డీఎస్పీ పూజితనీలం ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. ప్రొద్దుటూరు సెకండ్‌ ఏడీజే కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తూ వచ్చింది. తుది విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో ముద్దాయి జక్కి ప్రసాద్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 1.50 లక్షలు జరిమానా విధిస్తూ సెకండ్‌ ఏడీజే కోర్టు జడ్జి జీఎస్‌ రమేష్‌కుమార్‌ బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ3గా ఉన్న ముద్దాయి కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి కేసులో వాదనలు వినిపించారు.

పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ప్రశంస!
ఈ కేసులో సరైన సమయంలో సాక్షులను కోర్టుకు హాజరుపరచి ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రొద్దుటూరు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎ. నాగరాజు, త్రీ టౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కె. బ్రహ్మయ్య, టూ టౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎం. రామాంజనేయులుతో పాటు కేసును పర్యవేక్షించిన టూ టౌన్‌ సీఐ ఇబ్రహీంలను జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అభినందించారు.
ఇవి చ‌ద‌వండి: మ‌న‌స్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

>
మరిన్ని వార్తలు