ప్రధాన పట్టణాల్లో నగర వనాల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

ప్రధాన పట్టణాల్లో నగర వనాల ఏర్పాటు

Published Thu, Dec 14 2023 12:22 AM

- - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నగర వనాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్కును బుధవారం ఆయన సందర్శించారు. నగరవనం ప్రాజెక్టులో భాగంగా పార్కులో చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. పార్కును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు నగరవనం పథకం కింద ప్రభుత్వం రూ.1.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. మరో రూ.60 లక్షలు మంజూరు కావాల్సి ఉందన్నారు. గతంలో పార్కు ఎదురుగా ఉన్న రామేశ్వరం రిజర్వ్‌ ఫారెస్ట్‌ స్థలంలో నగరవనం ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే కొన్ని సమస్యలు ఉన్న కారణంగా ప్రస్తుతం రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్కులోని విజిటర్స్‌ జోన్‌లో నగర వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రామేశ్వరం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని కొంత స్థలాన్ని వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగిస్తామని చెప్పారు. అనుమతులు రాగానే నగరవనంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రస్తుతానికి 80 ఎకరాల్లో పనులు చేస్తున్నట్లు చెప్పారు. అవుట్‌డోర్‌ జిమ్‌, చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు, పాత్‌వే, గార్డెన్స్‌, సందర్శకుల కోసం విశ్రాంతి గదులు, యోగా హాల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతమున్న వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. పార్కు సందర్శనకు వచ్చే విద్యార్థులు, పిల్లలకు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పీసీసీఎఫ్‌ వివరించారు.

జిల్లాలో ఇలా..

ఉమ్మడ వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేల్‌, కోడూరు, రాజంపేట, జమ్మలమడుగు సమీపంలోని పొన్నతోట ప్రాంతాల్లో నగరవనం ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. రాయచోటిలో పనులు జరుగుతున్నాయన్నారు. పులివెందులలో ఇటీవలే సిటీఫారెస్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. కడపలో నగరవనం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్ట్‌ పి.రామకృష్ణ, కడప డీఎఫ్‌ఓ పీవీ సందీప్‌రెడ్డి, సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి, కడప ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ గురుప్రభాకర్‌, ప్రొద్దుటూరు సబ్‌ డీఎఫ్‌ఓ ఎన్‌వీ దివాకర్‌, రేంజర్‌ ఆఫీసర్‌ హేమాంజలి పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో రూ.1.40 కోట్లతో పనులు ప్రారంభం

రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి వై.మధుసూదన్‌రెడ్డి

Advertisement
Advertisement