చిత్తూరు, అనంత జట్ల జయకేతనం

10 Oct, 2023 06:06 IST|Sakshi
కేఓఆర్‌ఎం మైదానంలో పోటీపడుతున్న చిత్తూరు, కర్నూలు జట్లు

కడప: ఏసీఏ అండర్‌–23 అంతర్‌ జిల్లాల మల్టీడేస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో చిత్తూరు, అనంతపురం జట్లు జయకేతనం ఎగురవేశాయి. కడప నగరంలోని కేఓఆర్‌ఎం మైదానంలో 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. జట్టులోని శశాంక్‌ శ్రీవాత్సవ్‌ 29 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్‌ సాత్విక్‌ 2 వికెట్లు తీశాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 54.4 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. జట్టులోని సాయిసూర్యతేజారెడ్డి 140 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లు ఆశిష్‌రెడ్డి 4, మల్లేశన్‌ 3 వికెట్లు తీశారు. కాగా చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేయగా, కర్నూలు జట్టు 226 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టు 176 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. 

‘అనంత’ విజయం

కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో 282 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 64.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. జట్టులోని దత్తారెడ్డి 87 పరుగులు చేశాడు. కడప బౌలర్లు అస్లాం 3, విజయ భువనేంద్ర 2, ఆదిల్‌ హుస్సేన్‌ 2, సాయికుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.

జట్టులోని శివకేశవరాయల్‌ 24 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లు లోహిత్‌సాయికిశోర్‌ 6 వికెట్లు, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో అనంత జట్టు 207 పరుగులు చేయగా, కడప 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 182 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు