ఆదిలాబాద్: కొలిచే వారేరి?

9 Mar, 2019 09:05 IST|Sakshi

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): ఇద్దరు రైతుల మధ్య భూ తగాదా ఏర్పడినప్పుడు ఆ భూమిని కొలిచి సమస్యను పరిష్కరించాలి. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరతతో ఎక్కడి భూ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వందలాది కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. అత్యవసరంగా భూములు కొలవాల్సి వచ్చినప్పుడు సర్వేయర్ల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు భూ సమస్యలపై అధికంగా దరఖాస్తులు వస్తుంటాయి. భూ వివాదాల కోసం దరఖాస్తు చేసుకున్న భూముల్లో పంటలు ఉండటంతో ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్‌ మధ్యలోనే సర్వేయర్లు భూములను కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండటంతో ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 

వేధిస్తున్న ఖాళీలు..
జిల్లాలో 18 మండలాల్లో 18 మంది సర్వేయర్లు ఉండాలి. కానీ కేవలం 8 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నాలుగైదు సంవత్సరాల నుంచి సర్వేయర్లు లేకపోవడంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు మూడు మండలాలు ఇన్‌చార్జి ఇవ్వడంతో భూ సమస్యలు పరిష్కారానికినోచుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ సర్వేలో భూ వివాదాలపై జిల్లా వ్యాప్తంగా 2 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే సర్వేయర్లు అందుబాటులో లేక పనులు ముందుకు సాగడం లేదు. 

ఏళ్లుగా డిప్యూటేషన్లే..
జిల్లాలోని 8 మంది సర్వేయర్లలో కొంత మంది సంవత్సర కాలంగా డిప్యూటేషన్‌పై ప్రాజెక్టుల్లో భూసేకరణ కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా, పిప్పల్‌కోటి ప్రాజెక్టుల భూ సేకరణ కోసం గత సంవత్సరం నుంచి 8 మంది సర్వేయర్లలో ముగ్గురు ఈ పనుల్లోనే ఉన్నారు. అంటే ప్రసుతం జిల్లాలో 8 మంది సర్వేయర్లలలో ఐదుగురు మాత్రమే మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  

ప్రైవేట్‌ సర్వేయర్లకు భలే గిరాకీ..
ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటంతో ప్రైవేట్‌ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంది. అన్నదమ్ముల భూ పంపకాలు, ఇద్దరు రైతుల మధ్య భూతగదాలు, భూవిక్రయాలు జరిగినప్పుడు భూ లెక్కలు తేల్చడానికి సర్వేయర్లు అవసరం. ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటం, ఉన్న వారు కూడ అత్యవసరంగా రాకపోవడంతో పలువురు రైతులు ప్రైవేట్‌ సర్వేయర్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ప్రైవేట్‌ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంటోంది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు అంటే.. వర్షాలు పడేంత వరకు ప్రైవేట్‌ సర్వేయర్లు భూ లెక్కల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటు సర్వేయర్లకు అన్నంత ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.     

ప్రైవేట్‌ సర్వేయర్‌తో భూమి కొలిపించాం
సర్కారు సర్వేయర్‌ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినం. సంవత్సరం నుంచి ఆయన డిప్యూటేషన్‌లో ఉన్నాడని తెలిసింది. దీంతో అత్యవసరంగా మా భూమి కొలవాల్సి రావడంతో గత్యంతరం లేక ప్రైవేటు సర్వేయర్‌ను కొలిపించాం.

– రాథోడ్‌ దినేశ్‌నాయక్, దాబా(కె), ఇచ్చోడ మండలం      

మరిన్ని వార్తలు