గంటన్నర ఆలస్యంగా దుర్గగుడి మూసివేత

7 Jan, 2018 02:08 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఇంద్రకీలాద్రిపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చిన డిసెంబరు 26వ తేదీన రాత్రి గంటన్నర ఆలస్యంగా దుర్గగుడిని మూసివేసినట్లు నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు గుడిని మూసివేస్తారు. డిసెంబర్‌ 26న మాత్రం రాత్రి 11.30 గంటలకు మూసివేసినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై విచారణను పూర్తి చేసిన ఈ కమిటీ సభ్యులు రఘునాథ్, శ్రీరామశర్మ తమ నివేదికను శనివారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్‌ అనూరాధకు అందజేశారు. అనంతరం ఈ మొత్తం వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, కమిషనర్‌ అనూరాధ, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు.

భద్రతాపరమైన లోపమేనట! 
ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్‌ 26న రాత్రి ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా ఎందుకు మూసివేయాల్సి వచ్చిందన్న దానిపై అర్చకులు, ఆలయ సిబ్బందిని నిజనిర్ధారణ కమిటీ ప్రశ్నించింది. భద్రతా సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. భద్రతాపరమైన లోపం కారణంగానే ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా మూసివేశారంటూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దేవాదాయశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. అంటే భద్రతాపరమైన లోపం అనే చిన్న కారణం చూపి, తాంత్రిక పూజల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు