ప్రధాన బుకీ సహా10 మంది అరెస్టు

22 Feb, 2015 00:58 IST|Sakshi

రూ.3.42లక్షలు స్వాధీనం
 పరారీలో మరో బుకీ

 
విజయవాడ సిటీ : నగంలోని క్రికెట్ బెట్టింగ్‌స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రధాన బుకీ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో ప్రధాన బుకీ పరారవగా, పట్టుబడిన వారి నుంచి రూ.3.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నింది తులను ఆయా పోలీసు స్టేషన్లకు అప్పగిం చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్, పి.మురళీధరన్ ఈ దాడులను పర్యవేక్షించగా ఎస్‌ఐలు ఆర్.సురేష్ రెడ్డి, జి.శ్రీనివాస్ తమ సిబ్బందితో పాల్గన్నారు.

నగల తయారీ మాటున బెట్టింగ్ దందా

రెండేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధాన బుకీని ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు కలెక్షన్ వ్యవహారాలు చూసే మరో వ్యక్తిని, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2,64,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆయా వ్యక్తులకు ఇవ్వాల్సిన, రావాల్సిన నగదు లావాదేవీలతో కూడిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. గుణదల గంగానమ్మ గుడి ప్రాంతానికి చెందిన వరదా కేశవరాం         ప్రసాద్ అలియాస్ రాంబాబు బంగారు నగల తయారీ వృత్తి చేస్తుంటాడు. రెండేళ్లుగా క్రికెట్ బుకీ అవతారం పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు. శని వారం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు రూఢీ చేసుకొని దాడి చేసి అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాచవరం పోలీసులకు అప్పగించారు.

గవర్నరుపేటలో..

ఓ స్టార్ హోటల్‌లో గది అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శనివారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.  పోలీసుల రాకను పసిగట్టి హైదరాబాద్‌కు చెందిన ప్రధాన బుకీ అప్పారావు పరారవ్వగా నగరానికి చెందిన డి.ప్రదీప్ కుమార్ రెడ్డి, టి.రాజేష్ కుమార్, కె.చిట్టిబాబు, పి.వెంకటనరేష్, పి.సత్యనారాయణను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.78వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్న సొత్తు సహా నిందితులను గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు.
 
 

మరిన్ని వార్తలు