యోగాసనాలు ఎందుకు చేయాలి? | Sakshi
Sakshi News home page

యోగాసనాలు ఎందుకు చేయాలి?

Published Sun, Feb 22 2015 12:54 AM

యోగాసనాలు ఎందుకు చేయాలి?

యోగా
ఆసనం అనేది ఒక భంగిమ. మీ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలు ‘యోగాసనాలు’గా గుర్తించబడ్డాయి. ‘యోగా’ అంటే మిమ్మల్ని ఒక ఉన్నత పార్శ్వానికి లేక ఉన్నతమైన జీవిత అవగాహనకు తీసుకువెళ్లేది. అందువల్ల ఎటువంటి భంగిమ అయితే మిమ్మల్ని ఉన్నత అవకాశాలవైపు తీసుకువెళ్తుందో దాన్నే యోగాసన అంటారు.
 
మీరు అనుభవించే వివిధ మానసిక, భావోద్వేగ పరిస్థితులకు మీ శరీరం సహజంగానే ఒక భంగిమను తీసుకుంటుంది. మీరు ఆనందంగా ఉంటే, ఒక విధంగా కూర్చుంటారు. మీరు ఆనందంగా లేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మరోలా కూర్చుంటారు. ఎవరైనా ఎలా కూర్చున్నారనే దాన్ని బట్టి వారి విషయంలో ఏమి జరుగుతుందో మనం కొన్నిసార్లు చెప్పగలుగుతాము. మీరు ఇది గమనించారా? ఆసన శాస్త్రంలో దీనికి విరుద్ధంగా చేస్తాము. అంటే చేతనంగా మీ శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి మీ చైతన్యాన్ని పెంచేలా చేస్తాం.

ఒక నిర్దిష్ట విధానంలో కూర్చోవడం ద్వారా మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయాలను మార్చుకోవచ్చు. యోగాసనాలలో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. మనం 84 ఆసనాలు అన్నప్పుడు అవి 84 భంగిమలని అనుకోకండి. ఇది ముక్తి సాధించడానికి ఉన్న 84 వ్యవస్థలు, లేదా 84 మార్గాలు. మీకు కేవలం ఒక్క యోగాసనంలో ప్రావీణ్యత ఉంటే, ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెసుకోవచ్చు.
 
యోగాసనాలు అనేవి వ్యాయామ ప్రక్రియలు కావు. అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. ఇవి ఒక స్థాయి ఎరుక(ఎవేర్‌నెస్)తో చేయవలసి ఉంటుంది. యోగా సూత్రాలతో పతంజలి ‘‘సుఖం స్థిరం ఆసనం’’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యమైనదీ, స్థిరమైనదో, అదే మీ ఆసనం! మీ శరీరం అత్యంత సౌకర్యంగా ఉండి, మనస్సుకు కూడా పూర్తిగా హాయిగా ఉండి, మీ శక్తి పూర్తి ఉత్తేజంలో, సమతుల్యతతో ఉంటే అప్పుడు మీరు ఊరికే కూర్చున్నా, ధ్యానంలోనే ఉంటారు.
 ఆసనమనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందువల్ల ఆసనాలు అనేవి ఒక విధంగా చురుకైన ధ్యాన మార్గాలే!
 - సద్గురు జగ్గీ వాసుదేవ్
www.sadhguru.org

 

Advertisement

తప్పక చదవండి

Advertisement