అలంకార ప్రియుడికి  పుష్పయాగం

4 Nov, 2019 11:33 IST|Sakshi

అలంకార ప్రియుడికి  పుష్పయాగం

శ్రీవారి ఆలయంలో వైభవంగా అంకురార్పణ

 మధ్యాహ్నం ఒంటిగంటకు పుష్పార్చన ప్రారంభం

 7నుంచి 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో  శ్రీవారికి పుష్పార్చన 

శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా స్వామివారికి విధిగా నిర్వహిస్తారు. పుష్పాలంకరణలో ఉన్న ఆ శేషాచలవాసుడి నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్లు చాలవు. భక్తులు తన్మయత్వంతో పొంగిపోతారు. తిరుమలలోని ప్రతి పుష్పం పుష్పించి, వికసించి సేవించి తరిస్తోంది. అలాంటి అలంకార ప్రియుడికి సోమవారం మధ్యాహ్నం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఆగమ శాస్త్రోక్తంగా సంప్రదాయ పుష్పలు,పత్రాలతో శాస్త్రోక్తంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అర్చించనున్నారు. సోమవారం ఉదయం వైభవంగా పుష్పయాగం ప్రారంభమైంది. పుష్పాల బుట్టలతో స్వామివారిని అధికారులు ఆలయానికి తీసుకు వచ్చారు. 

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి వైభవాన్ని, సేవలను కళ్లారా తిలకించి తరించడం పూర్వజన్మ సుకృతం. ఏటా స్వామివారికి నిర్వహించే  బ్రహ్మోత్సవాల్లో తెలిసీ, తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరతూ శ్రీవారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. గతంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ పుష్పయాగాన్ని నిర్వహించేవారు. అయితే స్వామివారి సేవల్లో జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నందున ఈ ఉత్సవాన్ని కార్తీక మాసానికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారికి కార్తీక శ్రవణా నక్షత్రం రోజున ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి నిత్యారాధన అనంతరం బంగారు తిరుచ్చిలో శ్రీదేవి,భూదేవి సమేతంగా రాచమర్యాదలతో యాగశాలకు వేంచేస్తారు. 

అక్కడ స్వామివారికి తొలుత అభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి తులసిమాలలు ధరింపజేస్తారు. అనంతరం సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. విష్ణుగాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హోమం నిర్వహిస్తారు. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాధిపతికి సంబంధించిన హోమం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్ప సమర్పణలో భాగంగా స్వామివారి కంఠం వరకూ వివిధ రకాల పుష్ప సమర్పణ జరుగుతుంది. అర్చకులు అ పుష్పాలను పాద పద్మములకు సరిగా సరిచేస్తారు. అప్పుడు నీరాజనం జరుగుతుంది. ఇదేవిధంగా 20 పర్యాయాలు చేస్తారు. ఆపై హవిర్నవేదనం జరిగుతుంది. తదనంతరం అగ్ని విసర్జనం కూడా జరుపుతారు. స్వామిదేవేరులతో సన్నిధానం చేరుకుంటారు. దీంతో పుష్పయాగం ముగుస్తుంది.
  
పూల బావికే సొంతం 
శ్రీవారికి అలంకరించిన, వినియోగించిన పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వరు. ప్రతి పుష్పాన్ని ఆలయంలోని బావిలో వేస్తారు. ఆలయంలోని అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూలబావి ఉంది. దీనినే భూతీర్థం అని కూడా అంటారు. ఇందులో వేసిన పూలను తర్వాత స్వామివారి పూతోటకు ఎరువుగా వినియోగిస్తారని టీటీడీ ఉద్యానవన విభాగం తెలుపుతోంది.

నిత్యం పుష్పార్చనే
తిరుమల శ్రీవారికి ఒకరకంగా నిత్యం పుష్పాభిషేకమే. రోజూ 18 రకాల పుష్పాలతో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి పుష్పార్చన చేస్తారు. ఇందులో చామంతి, సంపంగి, రోజా, నందివర్ధనం, మరువం, దవనం, పన్నీరుఆకు, తులసి, మల్లెలు, కనకాంబరాలు, మొలలు, సెంటుజాజులు, తామర, కలువ, మొగిలిరేకులు తదితర పుష్పాలను  సమర్పిస్తారు. కేవలం ఒక్కరోజు స్వామివారి అలంకరణకు 120 కేజీల పుష్పాలు వినియోగిస్తారు. నిత్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవవరకు జరిగే ప్రతి సేవలో  60 కిలోల పుష్పాల వినియోగం ఉంటుంది. వీటితోపాటు ప్రతి గురువారం శ్రీవారికి పూలంగిసేవ నిర్వహిస్తారు. 

ఈసేవలో 100 నుంచి 120 కేజీల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారి నిత్య సేవలో ప్రశస్తమైన తోమలసేవకు 60 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి పూల హారాలను మార్చుతారు. శ్రీవారి తలనుంచి భుజం వరకు అమర్చే పూలసెట్‌ను శిఖామణి అంటారు. భుజాల నుంచి పాదాల వరకు అలంకరించే పూలమాలను సాలిగ్రామం అంటారు. వక్షస్థలంలో ఉండే శ్రీదేవి, భూదేవి, కంఠహారం అలంకరణలు అన్నింటినీ కలిపి తోమాలసెట్‌ అంటారు. ఇలా నిత్యం తిరుమల స్వామి అలంకరణ, ఉత్సవాలు, సేవల్లో అలంకరణకు వందలాది కేజీల పుష్పాలను వినియోగిస్తారు.

ఎన్ని పుష్పాలో.. పత్రాలో..
తిరుమల ఆలయంలోని కల్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగే పుష్పయాగంలో  7 నుంచి 10 టన్నుల సంప్రదాయ పుష్పాలను ఉపయోగించనున్నారు. చామంతి, రోజా, సంపంగి, గన్నేరు, నూరు వరహాలు, మల్లెలు, మొల్లలు, సెంటు జాజులు, కనకాంబరాలు, తామరపూలు, కలువపూలు, మాను సంపం గి,నందివర్ధనం, సెంటుజాజులు, మొగిలిపూలు తదితర పుష్పాలు మొగిలిరేకులు, మొరవం, దవనం, మారేడుదళం, పన్నీరుఆకు, కదిరికజ్జాతదితర పత్రాలతో  సప్తగిరివాసుడిని వేదోక్తంగా అర్చించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ప్రతి పుష్పం స్వామి సేవకే..
తిరుమల పుష్పించే ప్రతి పుష్పం స్వామివారికే. ఇది తిరుమల క్షేత్రం సంప్రదాయం. స్వామి సేవలకు అవసరమయ్యే పుష్పాల కోసం 9వ శతాబ్దంలో అనంతాళ్వార్‌ అనేభక్తుడు ఆలయం వెనుకభాగంలో పూతోటను ఏర్పాటు చేశాడు. తోటలో పుష్పించిన పుష్పాలతో స్వామివారిని పూజించేవారు. ఆయన తదనంతరం ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని పాటించారు. 1996లో టీటీడీలో మీరాశీ వ్యవస్థను రద్దు చేశాక టీటీడీ ఆధీనంలోనే పూతోటను నెలకొల్పారు. శ్రీవారికి అవసరమైన పుష్పాలను సేకరించే బాధ్యతను టీటీడీ ఉద్యానవన శాఖకు అప్పగించింది. సుమారు వంద ఎకరాల్లో ఉద్యానవనశాఖ పూతోటను నిర్వహిస్తోంది. ఇక్కడి పుష్పాలను స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. వీటితోపాటు దాతలు స్వామివారి సేవకోసం పుష్పాలను వితరణగా అందిస్తుంటారు. తమిళనాడులోని సేలం, శ్రీరంగం, కుంభకోణం, చెన్నై, కర్ణాటకలోని కరూర్‌తోపాటు మనరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి టన్నుల కొద్దీ పుష్పాలు తిరుమలకు  చేరుతుంటాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా