-

కాలుష్య తీవ్రతతో అమల్లోకి సరి-బేసి విధానం

4 Nov, 2019 11:31 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరడంతో వాహనాల నియంత్రణ కోసం సరి-బేసి విధానం సోమవారం ఉదయం నుంచి తిరిగి అమల్లోకి వచ్చింది. తమ కుటుంబాలు, పిల్లలను కాపాడుకునేందుకు ఈ పద్ధతికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తల్లితండ్రులను కోరారు. నవంబర్‌ 15 వరకూ సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం నుంచి ద్విచక్రవాహనాలు, ఎలక్ర్టిక్‌ వాహనాలను మినహాయించారు. 12 ఏళ్లలోపు చిన్నారులతో కూడిన మహిళలు నడిపే వాహనాలకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, ఎమర్జెన్సీ సహా 29 కేటగిరీలకు చెందిన వాహనాలను కూడా ఈ విధానం నుంచి మినహాయించారు. ఢిల్లీ సీఎం, మంత్రుల వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేకపోవడం గమనార్హం. సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ 4000 జరిమానా విధిస్తారు. నగరమంతటా ఈ విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులతో కూడిన 600కి పైగా టీంలను రహదారులపై నియోగించారు.


 ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తిరిగి సరి- బేసి విధానాన్ని అమలుచేయడాన్ని వాహనదారులు స్వాగతించారు. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్ధాలను  తగలబెట్టడం ఆపివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలతో కాలయాపన చేయకుండా కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో ఢిల్లీలో నివసించేందుకు జనం భయపడుతున్నారు. సంక్లిష్ట సమయంలో తాము మరో నగరానికి వెళ్లే యోచనలో ఉన్నామని 40 శాతం మంది ఢిల్లీ వాసులు ఓ సర్వేలో పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు