గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్

8 May, 2015 17:47 IST|Sakshi
గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్

అనంతపురం: రాప్తాడులో వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన ఘటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతో సహా 32 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.

 

గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలపై పోలీసులు మరో నాలుగు కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై వారు మాట్లాడుతూ.. తాము ప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని చూడటానికి వెళితే.. తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే ఐదు అక్రమ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశామని.. అయినా ఎస్పీ, డీఎస్పీలు తమపై కేసులు ఎందుకు నమోదు చేశారో వారే సమాధానం చెప్పాలన్నారు.

ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీ నేతలను కావాలనే వేధిస్తున్నారని న్యాయవాది నారాయణ రెడ్డి తెలిపారు. గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి 30 మందితో కలిసి ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు శాంతి భద్రతలను ఎందుకు కాపాడలేదని ప్రశ్నించారు.   ఇదే అంశంపై హెచ్ ఆర్సీని ఆశ్రయించామన్నారు. డీజీపీ నుంచి ఎస్పీ వరకూ చర్యలు తీసుకోవాలని హెచ్ ఆర్సీని కోరామని నారాయణ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు