‘కోట్‌పల్లి’ ఆధునికీకరణకు రూ.25 కోట్లు

7 Dec, 2013 23:43 IST|Sakshi

 తాండూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి, కొత్తవి నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు మైనర్ ఇరిగేషన్ విభాగం తెలంగాణ రీజియన్ సీఈ రాజేశ్వర్ చెప్పారు. శనివారం ఆయన తాండూరు ఇరిగేషన్ డీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.330కోట్ల ‘జైకా’ (జపాన్) నిధులతో తెలంగాణ రీజియన్‌లో 52 చిన్ననీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిలో ఆదిలాబాద్ జిల్లాలోనే 50 చెరువులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఎర్రబంక వాగు వద్ద ఒక చెరువు, రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో ఒక  చెరువు నిర్మిస్తున్నామన్నారు. నీటి నిల్వ కోసం మెదక్ జిల్లాలో 7 చెక్‌డ్యాంలు నిర్మిం నిర్మించినట్టు చెప్పారు.
 
  రాష్ట్ర నీటి కేటాయింపుల ప్రకారం ఆదిలాబాద్‌లో నీటి వనరులు అధికంగా ఉన్నందున ఇక్కడ చిన్ననీటి ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 52 చిన్ననీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలో సుమారు 27వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని  తెలిపారు. గత ఏడాది జూన్‌లోనే ఈ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యం జరిగిందని, వచ్చే ఏడాది జూన్‌లో వీటిని పూర్తిచేస్తామన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు)లో రూ.8.52కోట్లతో చేపట్టనున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం చెక్‌డ్యాం నిర్మాణానికి అవసరమైన పది ఎకరాల స్థలం సేకరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మూడు మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ చెక్‌డ్యాంలో 0.30టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉందని అన్నారు. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌తో పాటు తాండూరు పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు సమస్య ఉండదన్నారు. సుమారు 30 గ్రామాల పరిధిలో బోర్లు, బావులో భూగర్భ జలాలు పెంపొందుతాయని చెప్పారు.
 
 పెద్దేముల్‌లోని కోట్‌పల్లి మధ్యతరహా ప్రాజెక్టును రూ.25కోట్లతో ఆధునికీకరించనున్నట్టు తెలంగాణ రీజియన్ మైనర్ ఇరిగేషన్ సీఈ రాజేశ్వర్ తెలిపారు.
  ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల ఫైలు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) పరిశీలనలో ఉందని, త్వరలోనే క్లియరెన్స్ వస్తుందన్నారు. అలాగే మరో రూ.24కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించనున్నట్టు చెప్పారు. యాలాల మండలంలో ఆగిపోయిన శివసాగర్ ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు. సుమారు 12 కిలోమీటర్ల కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి స్థలం కేటాయింపు జరగలేదన్నారు. రైతులకు పరిహారం అందించిన తరువాత ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాంట్రాక్టర్‌కు ఇప్పుడున్న సిమెంట్, డీజిల్, స్టీల్ ధరల ప్రకారం చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. తాండూరు పట్టణంలోని ఐబీ అతిథిగృహాన్ని కొత్తగా జీ+1 పద్ధతిలో రూ.2కోట్లతో నిర్మించనున్నట్టు ఆయన వివరించారు.
 
 కబ్జాకు గురైన అతిథిగృహం స్థలం తిరిగి పొందేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ ందర్భంగా చెక్‌డ్యాం నిర్మించనున్న కాగ్నా వాగును సీఈ పరిశీలించారు. అంతకుముందు నాగులపల్లిలో రూ.2కోట్లతో నిర్మించనున్న చెరువు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
 
 విలేకరుల సమావేశంలో మైనర్ ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (హైదరాబాద్) వి.లింగరాజు, వికారాబాద్ ఈఈ వెంకటేష్, తాండూరు డీఈ నర్సింహ, జేఈ ధర్మకుమార్, నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్ అమరేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు