264వ రోజు పాదయాత్ర డైరీ

18 Sep, 2018 04:18 IST|Sakshi

17–09–2018, సోమవారం 
ఆనందపురం, విశాఖ జిల్లా  

బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?!
విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్‌ విశ్వకర్మ జయంతి నేడు. ఆయనకు మనసారా నమస్కరించాను. విశాఖ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిశారు. వారి పంచవృత్తులకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోందన్నారు. స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రబోధానంద ఆశ్రమ భక్తులు కలిసి తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై భయాందోళనలు వ్యక్తం చేశారు. అక్కడి ప్రజాప్రతినిధి సారథ్యంలో జరిగిన దాడులను వివరించారు. ప్రజాప్రతినిధులే దగ్గరుండి విధ్వంసం సృష్టించడం, పోలీసులనూ అసభ్య పదజాలంతో దూషించడాన్ని చూస్తుంటే.. ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా.. అనిపించింది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతల దాష్టీకాలు వీడియోలతో సహా బహిర్గతమైనా.. చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. బరితెగించిన నేతలను నియంత్రించకపోతే.. ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! 

పట్టుమని పదిహేనేళ్లు నిండకుండానే రోలర్స్‌ స్కేటింగ్‌లో ఖండాంతర ఖ్యాతి సాధించిన సోదరుడు పృథ్వీ కలిశాడు. ఆసియా స్థాయి పోటీల్లో పతకాన్ని సాధించినందుకు అభినందించాను. అతనితో పాటు గతేడాది పతకం విజేతలూ కలిశారు. వారితో పాటు పతకాలు సాధించిన ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వాలు నగదు నజరానాలతో ప్రభుత్వోద్యోగాలూ ఇచ్చాయట. ఏ ప్రోత్సాహమూ అందని దౌర్భా గ్యం ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని బాధపడ్డారు. ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్‌ బహుమతి ఇస్తానంటూ.. అవగాహన లేని హాస్యాస్పద ప్రకటనలు చేస్తూ.. నోటికొచ్చినట్టు చిత్తశుద్ధిలేని మాటలు మాట్లాడే పాలకుడి నుంచి ప్రోత్సాహాన్ని ఆశించడమంటే.. ఎండమావిలో నీటిని వెతుక్కోవడమే.  

వ్యవసాయాధారిత జనపనార మిల్లులు ఉత్తరాంధ్రలోనే అత్యధికం. వేలాదిమందికి ఉపాధినిచ్చే ఈ మిల్లులు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి జనపనార ఉత్పత్తులను ప్రోత్సహిస్తే.. పరిశ్రమ బతుకుతుందన్నారు జూట్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు. సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేసి పరిశ్రమను రక్షించాలని కోరారు. ప్లాస్టిక్‌ను తగ్గించి ఈ పరిశ్రమను ఆదుకోగలిగితే.. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చు.. పర్యావరణానికీ మంచి చేయవచ్చు.  

గంభీరం పంచాయతీలో ఐఐఎం కోసం వందల ఎకరాలు సేకరించారు. అందులో క్వారీ కొండలూ ఉన్నాయి. ఆ క్వారీలపై ఆధారపడి ఏళ్ల తరబడి బతుకుతున్న కార్మికులకు పరిహారం ఇవ్వలేదు.. ప్రత్యామ్నాయమూ చూపలేదు. పోనీ ఐఐఎం అయినా వచ్చిందా అంటే.. అదీ లేదు. మరి ఈ ప్రభుత్వం సాధించిందేంటంటే.. ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి లేకుండా చేయడం.. రోడ్డున పడేయడం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మహిళా తహసీల్దార్‌ను కిందపడేసి కొట్టడం, తణుకులో ఓ ఎస్‌ఐని నిర్బంధించి అవమానించడం, విజయ వాడలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌నే దుర్భాషలాడి.. దౌరన్యం చేయడం, సూర్యలంక బీచ్‌లో టూరి జం సిబ్బందిపై దాడి చేసి కొట్టడం.. వంటివి మీ ప్రజాప్రతినిధుల దాష్టీకాలలో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఏ ఒక్కరినైనా కనీసం మందలించారా? ఏ చర్యలూ తీసుకోకుండా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే.. తాడిపత్రిలాంటి ఆటవిక ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయా? 
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు