నాలుగు రోజుల్లో రూ.30.76కోట్లు స్వాధీనం

14 Mar, 2019 04:48 IST|Sakshi
అనంతపురం జిల్లా యూ.రంగాపురం చెక్‌పోస్ట్‌ వద్ద స్వాధీనం చేసుకున్న వెండి ఆభరణాలు

17.940 కేజీల బంగారం పట్టివేత

అనుమానం వస్తే రూ.పది వేలయినా స్వాధీనం చేసుకుంటాం

31 సరిహద్దు చెక్‌పోస్టులు,161 సంచార బృందాలు ఏర్పాటు

ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తాం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో 30,76,50,984 నగదు, 17.940 కేజీల బంగారాన్ని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అనుమానం వస్తే పది వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ బుధవారం ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి 6,600 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్,  6,160 స్టాటిక్‌ సర్వలెన్స్‌ బృందాలు, వీడియో సర్వలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సరిహద్దుల్లో 31 ఎక్సైజ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే 46 తాత్కాలిక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, 18 సరిహద్దు మొబైల్‌ పార్టీ చెక్‌పోస్టులను , 161 మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో  కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామని, సోషల్‌ మీడియా వెబ్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. 

పెదకాకాని వద్ద రూ.67 లక్షలు..
ఎన్నికల నియమావళి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం చేసిన వాహనాల తనిఖీల్లో  నోట్ల కట్టలతో పాటు బంగారం, వెండి అభరణాలు సైతం పట్టుబడ్డాయి. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం నుంచి ఏటీఎం సెంటర్లలో నగదు నింపేందుకు గుంటూరు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నంబూరు నుంచి వింతా శ్రీనివాసరెడ్డి స్కూటీలో రూ.3 లక్షలు పట్టుకున్నారు.  

గుంటూరు జిల్లా తాడికొండలో తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన నగదు 

విశాఖలో రూ.18.51లక్షలు..
సరైన పత్రాలు లేని రూ.18.51లక్షలను విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు స్థానిక ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ ఉడా లేఅవుట్‌ జంక్షన్‌ వద్ద పట్టుకున్నారు. ద్వారాకానగర్‌ నుంచి మర్రిపాలెం ఉడా లేఅవుట్‌కు వెళుతున్న విజయభాస్కర్‌ అనే వ్యక్తి ఏపీ31 సీఎమ్‌ 8559 నంబర్‌ గల సిఫ్ట్‌ డిజైర్‌ కారులో రూ18.51లక్షలు చిన్నబ్యాగులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాను ఎస్‌బీసీ సినిమా సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నానని, తమ సంస్థకు మూడు జిల్లాల్లో 12 సినిమా హాళ్లు ఉన్నాయని విజయభాస్కర్‌ చెబుతున్నారు. 

తాడికొండలో రూ.9 లక్షలు..
గుంటూరు జిల్లా తాడికొండలో హైదరాబాద్‌ యల్లారెడ్డిగూడకు చెందిన కళ్యాణ్‌ అనే వ్యక్తి కారు నుంచి రూ.9 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించడంతో వదిలేశారు.  

రేపల్లె మండలంలో..
రేపల్లె మండలంలోని శిరిపూడి గ్రామంలో  శ్రీకాంత్‌ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.3.08 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు అప్పగించారు. ఆధారాలు సమర్పించడంతో నగదును తిరిగి ఇచ్చేశారు.

3.563 కేజీల బంగారం సీజ్‌.. 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి  రెండు ప్రైవేట్‌ జ్యూయలరీ సంస్థలకు చెందిన 3.563 కేజీల బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు ఓ వాహనంలో తిరుపతి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలు అనుమానాస్పదంగా ఉండడంతో బంగారాన్ని సీజ్‌ చేశారు.

బిల్లుల్లేని బంగారం..
గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటకు చెందిన బెజవాడ హరి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న  800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ప్రస్తుతం నిందితుడు తెనాలి వన్‌టౌన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

22 కిలోల వెండి.. 
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని యూ.రంగాపురం చెక్‌పోస్ట్‌ వద్ద బెంగళూరు నుంచి పావగడ వెళ్తున్న ఓ కారును తనిఖీ చేసి 22 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.47 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు