22న ‘మండలి’ ఓటర్లకు ప్రత్యేక సెలవు 

14 Mar, 2019 04:51 IST|Sakshi

సీఈఓ రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు/ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి ఈ నెల 22న ఎన్నికల్లో ఓటేయనున్న ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. అదే విధంగా పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు వీలుగా విధి నిర్వహణలో ప్రత్యేక సడలింపులు కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి ప్రైవేటు ఉద్యోగులు ఆలస్యంగా విధులకు వచ్చినా అనుమతించాలని, అవసరమైతే వారి షిఫ్టుల సమయాన్ని సర్దుబాటు చేయాలని కోరారు. మండలి ఎన్నికలు జరగనున్న 25 జిల్లాల్లో ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.  

21, 22న సెలవు ప్రకటించండి: సీఎస్‌ 
పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు పోలింగ్‌కు ముందు రోజు 21న, పోలింగ్‌ రోజు 22న స్థానిక సెలవును ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు కౌంటింగ్‌ నిర్వహించే 26న స్థానిక సెలవు ప్రకటించాలని కోరారు.  

దివ్యాంగులకు మినహాయింపు.. 
లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను నియమించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సిబ్బంది నియామకం విషయంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

మరిన్ని వార్తలు