ఆర్టీసీలో... 300

24 Feb, 2014 00:33 IST|Sakshi

వెళ్లాల్సిన అధికారుల సంఖ్య.. కార్మికులు ఎక్కడివారక్కడే
 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన పెద్ద కసరత్తు లేకుండా సులభంగానే జరగనుంది. కేవలం 300 మంది అధికారులను మాత్రమే అటూ ఇటూ మార్చాల్సి వస్తుంది. వీరు మినహా మిగతా సిబ్బందంతా ఎవరి ప్రాంతంలో వారు పని చేస్తున్నందున సమస్యేమీ ఉండబోదు. సిబ్బంది విభజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక ఆ 300 మంది అధికారుల మార్పుకు కసరత్తు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో 1.25 లక్షల మంది కార్మికులున్నారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యే అధికం. మెకానిక్ విభాగంలో కొద్దిమంది కార్మికులున్నారు. వీరి నియామకాలన్నీ దాదాపుగా జిల్లాలవారీగానే జరిగాయి. సాధారణంగా ఉండే నాన్ లోకల్ కోటా కింద మాత్రమే ఒక ప్రాంతానికి చెందిన సిబ్బంది మరో ప్రాంతంలో పని చేస్తున్నారు. కాబట్టి కార్మికులపరంగా విభజన తంతు నామమాత్రమే. అధికారుల విభాగంలో 702 మంది విధుల్లో ఉన్నారు.
 
 వీరిలోనూ దాదాపు 400 మంది ఎక్కడి వారక్కడే ఉన్నారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం, రీజినల్ కార్యాలయాల్లో మాత్రమే వేరే ప్రాంతాల వారున్నారు. వీరు దాదాపు 300 మంది అని లెక్క తేల్చారు. వీరు మాత్రమే ఇప్పుడు సొంత ప్రాంతాలకు మారాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి సూచనలేమీ రాకున్నా విధుల్లో చేరినప్పుడు సమర్పించిన పదో తరగతి పత్రాల ఆధారంగా వారి స్వస్థలాల వివరాలు సేకరిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది కోసం హైదరాబాద్‌లోని తార్నాకలో నిర్మించిన ఆసుపత్రి విభజన నేపథ్యంలో తెలంగాణకే పరిమితం కానున్నందున సీమాంధ్రకు ప్రత్యేక ఆసుపత్రి నిర్మించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
 

మరిన్ని వార్తలు