ప్రేమ సమాజం భూములు ధారాదత్తం

5 May, 2017 01:32 IST|Sakshi
ప్రేమ సమాజం భూములు ధారాదత్తం

33 ఏళ్లు సాయి ప్రియా రిసార్ట్స్‌కు లీజుకిచ్చిన సర్కారు
ఈ భూముల విలువ రూ. 500 కోట్లు


సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రూ.500 కోట్ల విలువైన భూము లను చంద్రబాబు ప్రభుత్వం సాయి ప్రియా రిసార్ట్స్‌కు కారు చౌకగా కట్టబెట్టింది. ఏడు దశాబ్దాలకు పైగా సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న ‘ప్రేమ సమాజం’ సంస్థకు 1959లో రావు అండ్‌ కంపెనీ అ«ధినేత చెరువు ప్రసాదరావు రుషి కొండలోని సర్వే నంబర్‌ 16, 23, 24లో ఉన్న సుమారు 50 ఎకరాల భూమికి పట్టా రాయించి ఇచ్చారు. 1971లో సర్వే చేయిస్తే నికరంగా 47.33 ఎకరాలు అక్కడ ఉన్నట్టు తేలింది.

 2003–04లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రేమ సమాజం కార్యదర్శిని ప్రలోభపెట్టి సాయి ప్రియా రిసార్ట్స్‌ 33 ఏళ్లకు 33.70 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ భూములు తమకు చెందిన వంటూ దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై సంస్థ ప్రతి నిధులు హైకోర్టును ఆశ్రయించగా ఆ భూమిపై  హక్కులు ప్రేమ సమాజానివేనని తీర్పు ఇచ్చింది. అయినా భూములపై తమకే హక్కు ఉందని దేవాదాయ శాఖ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిడి మేరకు ఈ భూములను సాయి ప్రియా రిసార్ట్స్‌కే ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదికిచ్చారు.

దీని ఆధారంగా ఈ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం గురువారం జీవో 161 జారీ చేసింది. 2003 – 04లోనే లీజుకు తీసుకున్నందున గడిచిన 13 ఏళ్లను లీజు కాలపరిమితిగానే పరిగణిస్తూ మిగిలిన 20 ఏళ్లకు ఏడాదికి రూ.2.62 లక్షల చొప్పున రూ.19.06 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.40 వేలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన 33.70 ఎకరాల భూమి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

మరిన్ని వార్తలు